Trump: భారత్-పాక్ యుద్ధం ఆపింది నేనే.. మారని డొనాల్డ్ ట్రంప్ తీరు

Trump: మరోసారి కూడా భారత్ , పాకిస్థాన్ మధ్య తలెత్తిన అణు యుద్ధాన్ని తన దౌత్యనీతితోనే ఆపానని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు.

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాలను ఎప్పుడూ వేడెక్కిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ , పాకిస్థాన్‌‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఎందుకంటే మరోసారి కూడా భారత్ , పాకిస్థాన్ మధ్య తలెత్తిన అణు యుద్ధాన్ని తన దౌత్యనీతితోనే ఆపానని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు.

వాషింగ్టన్ డీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోతే, రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు కోట్లాది మంది ప్రాణాలను బలిగొనేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో ఇప్పటికే ఎనిమిది విమానాలు కూల్చివేయ్యబడ్డాయని, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ఆయన గుర్తు చేశారు.

ట్రంప్ (Trump)వాదన ప్రకారం.. ఆయన తన వాణిజ్య సుంకాలను (Trade Tariffs) ఒక అస్త్రంగా ఉపయోగించి రెండు దేశాలను యుద్ధం నుండి వెనక్కి తగ్గించారట. పాకిస్థాన్ ప్రధాని స్వయంగా తనకు ఫోన్ చేసి, తాను పది మిలియన్ల ప్రాణాలను కాపాడానని కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తనకు ఫోన్ చేసి, తాము యుద్ధానికి వెళ్లడం లేదని హామీ ఇచ్చారని ట్రంప్ పలు వేదికలపై ఇప్పటివరకు దాదాపు 60 సార్లు కంటే ఎక్కువ సార్లే చెప్పారు. తాను ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఇప్పటివరకు ముగించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్ , జెలెన్ స్కీ మధ్య ఉన్న ద్వేషం వల్లే ఆ యుద్ధం ముగియడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ట్రంప్(Trump) వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. భారత దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని వందలాది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.

Trump

మన సైన్యం దెబ్బకు తట్టుకోలేక పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు తనను తాను కాపాడుకోవడానికి పాకిస్థానే స్వయంగా కాల్పుల విరమణ కోరింది. ఇందులో మూడో పక్షం ప్రమేయం అస్సలు లేదని, భారత ప్రభుత్వం ఓపెన్‌గానే చెబుతున్నా.. ట్రంప్ తన గొప్పతనం కోసం ఇలాంటి కథలు అల్లుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ (Trump)తన విదేశాంగ విధానంలో వాణిజ్య సుంకాలను ఒక బెదిరింపు అస్త్రంగా ఉపయోగిస్తుంటారు. భారత్ పై కూడా 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించి, తాను చెప్పినట్లు వినేలా చేశానని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ భారతదేశం ఎప్పుడూ తన స్వంత నిర్ణయాలనే తీసుకుంటుంది. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం ట్రంప్ సిద్ధం చేసిన 28 సూత్రాల ప్రణాళికపై కూడా నాటో దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి చేసినవిగా కనిపిస్తున్నా, అంతర్జాతీయ సంబంధాల్లో ఇవి కొంత అలజడిని రేపుతున్నాయి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version