Bangladesh Crisis
బంగ్లాదేశ్‌తో భారతదేశానికి సుమారు 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. అక్కడ చిన్న అలజడి వచ్చినా ఆ సెగ భారత దేశానికి తగులుతుంది. 15 ఏళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వం.. మన దేశానికి అత్యంత సన్నిహితంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె రాజకీయ జీవితం పతనం కావడంతో, రాబోయే రోజుల్లో భారత్ ,బంగ్లాదేశ్ సంబంధాలు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నాయి.
తాజా రాజకీయ పరిణామాలతో ఒకవేళ బంగ్లాదేశ్‌లో అస్థిరత(Bangladesh Crisis) ఏర్పడితే మాత్రం, అక్కడి ప్రజలు ప్రాణభయంతో సరిహద్దు దాటి భారత్‌లోకి అందులోనూ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది శరణార్థుల సమస్యకు వేగంగా దారి తీస్తుంది. అంతేకాకుండా, షేక్ హసీనా హయాంలో అణిచివేయబడిన తీవ్రవాద ముఠాలు మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రమాదముంటుంది. ఇది భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల భద్రతకు పెద్ద తలనెప్పిగా మారుతుంది.
ఇప్పటికే బంగ్లాదేశ్‌లో అస్థిరత(Bangladesh Crisis )వల్ల జరుగుతున్న అల్లర్లలో హిందువుల ఇళ్లు, దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో..అక్కడ ఉన్న మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంటుంది.ఇప్పటికే ఈ విషయంలో మన అధికారులు దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతున్నారు.
షేక్ హసీనా భారత్‌కు మిత్రురాలు కాబట్టి.. ఇన్నాళ్లూ బంగ్లాదేశ్ భారతదేశానికి అనుకూలంగా మెలిగింది. కానీ ఆమె ప్రత్యర్థి అయిన ఖలీదా జియా (BNP) , ఆమె మిత్రపక్షం అయిన జమాత్-ఏ-ఇస్లామీ.. పాకిస్తాన్, చైనాలకు దగ్గరగా ఉంటాయి. బంగ్లాదేశ్‌లో వీరు కనుక పట్టు సాధిస్తే, అక్కడ చైనా, పాక్‌ల ప్రాబల్యం పెరిగి, అది భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుంది.
అంతేకాదు భారత దేశానికి,బంగ్లాదేశ్ మధ్య ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. మన ఈశాన్య రాష్ట్రాలకు వస్తువుల రవాణా కోసం మనం బంగ్లాదేశ్ వైపు నుంచి వెళ్లే ట్రాన్సిట్ రూట్లపైనే ఆధారపడతాం. ప్రస్తుత రాజకీయ అస్థిరత వల్ల ఈ వాణిజ్య ఒప్పందాలు కుంటుపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల భారత్‌లోని నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.
అదే కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నది నీటి పంపకాల విషయంలో.. షేక్ హసీనాతో మన దేశానికి కొంత సయోధ్య ఉండేది. కానీ ఇప్పుడు రాబోయే కొత్త బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుబట్టే అవకాశముంది. ఇది రెండు దేశాల మధ్య జల జగడాలకు దారితీసే పరిస్థితులను తీసుకువస్తుంది.మొత్తంగా పొరుగు ఇల్లు తగలబడుతుంటే మనం నిశ్చింతగా ఉండలేం కదా.. అచ్చంగా భారతదేశం ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉంది.
