OCD
చాలామంది ఓసీడీ అంటే కేవలం చేతులు పదే పదే కడుక్కోవడం ,తుడిచిన ఇంటిని మళ్లీ మళ్లీ తుడుచుకోవడం వంటి ఛాదస్తం పనులు అని మాత్రమే అనుకుంటారు. ఇంతవరకూ అయితే ఓకే కానీ కొంతమందిలో ఓసీడీ అంటే అంతకంటే లోతైన..ఒక అంతుచిక్కని ఆలోచనల చట్రం. మనసులో ఒక ఆలోచన రావడమే కాకుండా అది భయపెడుతూ,వారి ప్రమేయం లేకుండానే కొన్ని పనులను పదే పదే చేసేలా బలవంతం చేస్తుంది.
ఓసీడీ అంటే..అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (Obsessive Compulsive Disorder) అన్నమాట. ఓసీడీ(OCD) ఉన్నవారి మనసు గిర్రున తిరిగే చక్రం వంటిది. ఉదాహరణకు.. ఇంటికి తాళం వేశామా లేదా అన్న అనుమానం ముందుగా వస్తుంది. దానికోసం ఒక్కసారి చూస్తే సరిపోతుంది, కానీ ఓసీడీ ఉన్నవారు పదిసార్లు లాగి చూస్తారు. అన్ని సార్లు చూసినా పక్కకు వచ్చాక మళ్లీ అయ్యో.. సరిగ్గా వేయలేదేమో అన్న భయపడుతూ ఉంటారు.
అలాగే స్టవ్ కట్టేసామా? చేతులు మురికిగా ఉన్నాయా? గ్యాస్ సిలిండర్ ఆపానా లేదా? ఇలాంటి ఆలోచనలు వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారు ఆ పని చేయకపోతే ఏదో ఘోరం జరిగిపోతుందన్న ఆందోళన (Anxiety) వాళ్ళని వెంటాడుతుంది.
ఓసీడీలో ఎక్కువగా కనిపించే లక్షణాలు..
చేతులు,వస్తువులు కడిగినా ఇంకా బ్యాక్టీరియా ఉందన్న భయంతో రుద్ది రుద్ది కడగడం. తనే కాదు తను చుట్టుపక్కల మనుషులు, అక్కడి పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా అన్న అనుమానం.
తాళం వేశామా, స్విచ్ కట్టేశామా అని పదే పదే చెక్ చేయడంతో పాటు వస్తువులు ఒకే పద్ధతిలో, ఒకే లైన్లో ఉండాలని కోరుకోవడం. కొంచెం అటు ఇటు అయినా సరే తట్టుకోలేకపోవడం.
మనసుకు నచ్చని, భయంకరమైన, నెగటివ్ ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోవడం. దానివల్ల తాము చెడ్డవాళ్లమేమో అన్న ఆత్మన్యూనతా భావం కలగడం.
నిజానికి ఓసీడీ అనేది ఒక జబ్బు కాదు, ఇది మెదడులోని రసాయనాల అసమతుల్యత ముఖ్యంగా సెరోటోనిన్ లోపం వల్ల కానీ వంశపారంపర్యంగా కానీ వస్తుంది. విపరీతమైన ఒత్తిడితో పాటు కొందరికి చిన్నప్పుడు జరిగిన కొన్ని చేదు సంఘటనలు కూడా దీనికి కారణం అవుతాయి..
దీని నుంచి బయటపడటానికి మనలో ఆ సమస్య ఉందని అంగీకరించడం నేర్చుకోవాలి. నేను చేస్తుంది అతి అని మనసుతో నిత్యం చెబుతూ ఉండాలి.
మీ ఆలోచనను మీరే ఎదిరించాలి. ఒకసారి తాళం చెక్ చేశాక, మళ్లీ వెళ్లాలని అనిపించింది అనుకోండి కనీసం 15 నిమిషాలు ఆగి.. ఆ భయాన్ని భరించడానికి ప్రయత్నించండి. మెల్లమెల్లగా ఆ సమయాన్ని పెంచుకుంటూ పొండి.
అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, ధ్యానం చాలా అవసరం.అయితే ఓసీడీ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం సిగ్గుపడకుండా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) తీసుకోవాలి. డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్లతో మెదడులోని రసాయనాలు సెట్ అవుతాయి.
అలాగే ఓసీడీ(OCD) ఉన్నవారిని డీల్ చేయడానికి కుటుంబ సభ్యులకు కూడా కొన్ని సూచనలు ఉంటాయి. వారిని అస్సలు ఎగతాళి చేయకండి (Don’t Ridicule). అన్నిసార్లు ఎందుకు కడుగుతున్నావు?, పిచ్చి పట్టిందా అని వారిని ఎగతాళి చేయడమో, కోప్పడటమో చేయకూడదు. వారికి అది తప్పని తెలుసు, కానీ వారు చేయకుండా ఉండలేరు. మీ మాటలు వారిలో ఆందోళనను , సమస్యను మరింత పెంచుతాయి.
అంతేకాదు వారికి రీఅస్యూరెన్స్’ (Reassurance) ఇవ్వడం ఆపండి. అంటే ఓసీడీ ఉన్నవారు నేను తాళం వేశానా అని అడిగినప్పుడు, అబ్బా వేశావు కదా నేను కూడా చూశాను అని చెప్పకండి. మీరు ఎంత ఎక్కువ భరోసా ఇస్తే, వారి మెదడు అంతగా ఇతరులపై ఆధారపడటం మొదలుపెట్టేస్తుంది. దానికి బదులు నీకు అనుమానంగా ఉందని నాకు అర్థమవుతోంది, కానీ నువ్వు దీన్ని తట్టుకోగలవ్ అని మాత్రమే చెప్పండి.
వారి పనుల్లో సహాయం చేయడానికి ప్రయత్నించకండి.అంటే చాలామంది కుటుంబ సభ్యులు గొడవ ఎందుకులే అనుకుని, వారు పదే పదే చేసే వస్తువులను సర్దడం లేదా శుభ్రం చేయడం వంటి పనుల్లో వారికి సహాయం చేస్తారు. అలా చేస్తే.. వారిలో ఆ అలవాటు ఇంకా బలపడుతుంది. వారిని ఆ పని నుంచి మళ్లించడానికి మాత్రమే ప్రయత్నించండి.
ఓసీడీ ఉన్నవారు ఒకరోజులో పది సార్లు చేతులు కడుక్కోవడం కాకుండా,ఎనిమిది సార్లే కడిగితే అది వారి విషయంలో పెద్ద విజయమే అవుతుంది. అలాంటి చిన్న చిన్న మార్పులను వారిలో గుర్తించి మెచ్చుకుంటూ ఉండండి. అలాగే ఓసీడీ అనేది కేవలం మాటలతో తగ్గేది కాదు. దీనికి కచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం. అయితే వారిని బలవంతం చేయకుండా, వారిలో లోపాన్ని హైలెట్ చేయకుండా ప్రేమగా డాక్టర్ దగ్గరకో, థెరపిస్ట్ దగ్గరకో తీసుకెళ్లండి.
