Iran
ప్రస్తుతం ప్రపంచం మరో యుద్ధం ముంగిట నిలబడి ఉందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు అజేయమైన సైనిక శక్తి ఉన్న అమెరికా, మరోవైపు ఎవరికీ లొంగని పట్టుదలతో ఉన్న ఇరాన్(Iran). ఇంకా చెప్పాలంటే మధ్యప్రాచ్య సముద్ర తీరంలో అలల తాకిడి కంటే యుద్ధనౌకల కదలికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా తన అమ్ములపొదిలోని అధునాతన ఆయుధాలను ఒక్కొక్కటిగా మోహరిస్తుంటే, ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలకు పదును పెడుతోంది.
ఇది నిజంగానే మహా యుద్ధానికి దారి తీస్తుందా లేక రెండు దేశాలు హెచ్చరించుకునే వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనా? అన్నప్రశ్నలు తలెత్తుతున్నాయి. దౌత్య మార్గాలన్నీ మూసుకుపోతున్న ఈ సమయంలో, చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచ వినాశనానికి దారి తీసే పరిస్థితిలు అక్కడ ఉన్నాయి. నిజానికి ఈ రెండు దేశాల మధ్య గొడవ ఇప్పటిది కాదు, దీని వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది.
దీనికి ముఖ్యంగా మూడు రాజకీయ కారణాలు ఉన్నాయి. మొదటిది, అణు బాంబు తయారీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్ అణుశక్తిని పెంచుకోవడం అమెరికాకు ఏమాత్రం అస్సలు ఇష్టం లేదు. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తే మధ్యప్రాచ్యంలో తమ పట్టును కోల్పోతామని అగ్రరాజ్యానికి భయం.
ఇజ్రాయెల్ అంశాన్ని రెండోది చెప్పాలి. ఇజ్రాయెల్ అమెరికాకు ప్రాణస్నేహితుడు, కానీ ఇరాన్ (Iran)కు మాత్రం బద్ధశత్రువు. ఇరాన్ వేసే ప్రతి అడుగు ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదమని అమెరికా బలంగా నమ్ముతోంది.
ఇక మూడోది, ఆధిపత్య పోరుగా చెప్పుకోవాలి. గల్ఫ్ దేశాలలో తమ మాటే నెగ్గాలని అమెరికా చూస్తుంటే, తాము ఎవరికీ తలవంచమని ఇరాన్ సవాల్ విసురుతోంది. ఈ మొండితనమే ఇప్పుడు చర్చల దశను దాటి తుపాకుల మోత వైపు వెళ్లేలా చేస్తుంది.
ఈ యుద్ధ వాతావరణంలో ప్రపంచదేశాలను వణికిస్తున్న పేరు హార్మోజ్ జలసంధి (Strait of Hormuz). ఇది ఒక చిన్న సముద్ర మార్గం మాత్రమే కావొచ్చు, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కీలకమైన నాడిగా అంతా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో సుమారు ఇరవై శాతం ఈ చిన్న మార్గం గుండానే వెళ్తుంది.
ఒకవేళ యుద్ధం మొదలైతే కనుక, ఇరాన్ ఈ ప్రాంతంలో తమ క్షిపణులను కానీ నౌకలను కానీ అడ్డుగా ఉంచి చమురు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశముంది. ఈ జలసంధిపై పట్టు సాధించడం వల్ల ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకురావచ్చు అనేది ఇరాన్ వ్యూహం. ఒకవేళ ఇక్కడ రవాణా ఆగిపోతే మాత్రం, ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరల పెరుగుదలకు , ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే అమెరికా తన యుద్ధ నౌకలను అక్కడ మోహరించి, ఆ మార్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
అటు ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైళ్లను సిద్ధం చేసుకుంది. రాజకీయంగా రెండు దేశాల నాయకులు వెనక్కి తగ్గడానికి ఇష్టపడకపోవడం వల్ల సైనిక కవాతులు మొదలయ్యాయి. దీంతో ఒక చిన్న పొరపాటు జరిగినా, అది ప్రపంచ వినాశనానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దౌత్యం తన దారి వెతుక్కుంటుందా లేదా యుద్ధ మేఘాలు వర్షిస్తాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది..
