Shops
రంజాన్ నెల వచ్చిందంటే చాలు భాగ్యనగరం ఆ సందడే వేరు అన్నట్లు ఉంటుంది. భక్తి ప్రవృత్తులు, క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు, ఆత్మీయ ఆలింగనాలతో హైదరాబాద్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 2026 రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు సాగే కఠిన ఉపవాస దీక్షలు కూడా ప్రారంభమయిపోయాయి.
ఈ పవిత్ర మాసంలో అల్లా కరుణాకటాక్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు (తరావీహ్) చేస్తూ, దానధర్మాలకు (జకాత్) ప్రాధాన్యతనిస్తున్న ముస్లిం సోదరులతో భాగ్యనగరం కొత్త శోభను సంతరించుకుంది..
కాగా రంజాన్ మాసంలో రాత్రిపూట ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ షాపింగ్(Shops) చేసుకునే సామాన్యులకు, వ్యాపారస్తులకు వెసులుబాటు కల్పిస్తూ.. నెల రోజుల పాటు రాత్రంతా (24/7) వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణంగా రంజాన్ సమయంలో రాత్రి వేళల్లోనే వ్యాపార లావాదేవీలు కోట్లలో జరుగుతాయి. బట్టలు, చెప్పులు, ఇతర గృహోపకరణాల వ్యాపారులకు ఈ ఏడాది భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
రంజాన్ నెలలో ఒక్క హైదరాబాద్ జంట నగరాల్లోనే.. సుమారు రూ. 3,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి.
ప్రభుత్వ సానుకూల నిర్ణయం పట్ల అటు వ్యాపార వర్గాలతో పాటు, ఇటు ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా షాపింగ్(Shops) చేసుకునే వీలుంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు రంజాన్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది నోరూరించే హైదరాబాదీ హలీమ్. ఈ ఏడాది కూడా నగరంలోని ప్రధాన సెంటర్లలో హలీమ్ భట్టీలు సిద్ధమయ్యాయి. అయితే, హలీమ్ సెంటర్ల వద్ద విపరీతమైన రద్దీ వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.
హలీమ్ విక్రయించే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు.
కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు, దుకాణాల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంచాలని సూచించారు. జనం పెద్ద ఎత్తున గుమిగూడకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు.
దీనికితోడు జీహెచ్‌ఎంసీ (GHMC)ఎన్నికలు ముందు ఉండటంతో ఈసారి రంజాన్ మాసానికి రాజకీయ రంగు కూడా తోడైంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులకు భారీ స్కెచ్ వేశాయి.
కులమతాలకు అతీతంగా గంగా-జమునా తెహజీబ్‌ను చాటి చెబుతూనే.. స్నేహపూర్వక వాతావరణంలో ఇఫ్తార్ విందులు నిర్వహించడానికి రాజకీయ నేతలు కూడా పోటీ పడుతున్నారు.
నిజానికి రంజాన్ అంటే కేవలం ఉపవాసం కోసం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. అది సోదరభావాన్ని, ఓర్పును చాటిచెప్పే పండుగ. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో అటు ఆధ్యాత్మికత, ఇటు ఆర్థిక సందడితో ఈ ఏడాది రంజాన్ మరింత ఉత్సాహంగా సాగనుందని తెలుస్తోంది.
