Dead zones: సముద్రాలలో మాయమవుతున్న ఆక్సిజన్ ..అంతుచిక్కని డెడ్ జోన్స్

Dead zones: డెడ్ జోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం 'యూట్రోఫికేషన్' అనే ప్రక్రియ.భూమిపై ఉన్న నీటిలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ మృత్యు ఛాయ వెనుక ఉన్న కారణం ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పిదమే!

Dead zones

మనకు సముద్రం అంటే అంతులేని జీవరాశి, అనంతమైన నీలి ప్రపంచం గుర్తుకొస్తుంది. కానీ, ఈ భూగోళంపై కొన్ని సముద్ర ప్రాంతాలు, పెద్ద సరస్సుల అడుగు భాగాలలో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా అడుగంటిపోయి, ఏ ఒక్క జీవి కూడా జీవించలేని ‘నిర్జల ప్రాంతాలు’గా మారుతున్నాయి. వీటినే పర్యావరణ శాస్త్రవేత్తలు ‘డెడ్ జోన్స్'(Dead zones) అని పిలుస్తున్నారు. భూమిపై ఉన్న నీటిలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ మృత్యు ఛాయ వెనుక ఉన్న కారణం ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పిదమే!

ఈ డెడ్ (Dead zones)జోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం ‘యూట్రోఫికేషన్’ అనే ప్రక్రియ. మన పొలాల నుంచి, పరిశ్రమల నుంచి, నగరాల మురుగునీటి నుంచి విడుదలయ్యే నత్రజని (Nitrogen) ,ఫాస్ఫరస్ (Phosphorus) వంటి పోషకాలు నదుల ద్వారా ప్రవహించి, చివరికి సముద్రాలలోకి చేరుతాయి. ఈ పోషకాలు చేపలు, లేదా ఇతర జీవరాశికి కాకుండా, సముద్రపు ఉపరితలంపై ఉండే ‘ఆల్గే’ (నాచు) పెరుగుదలకు ఊతమిస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ నాచు పొరలు ఏర్పడతాయి, దీనిని ‘ఆల్గే బ్లూమ్’ అంటారు.

Dead zones

ఈ ఆల్గే పొరలు కొన్ని రోజుల తర్వాత చనిపోయి సముద్రపు అడుగు భాగానికి చేరుకుంటాయి. అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఈ చనిపోయిన నాచును కుళ్లిపోయేలా (Decompose) చేస్తుంది. ఈ కుళ్లిపోయే ప్రక్రియలో ఆ బ్యాక్టీరియా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను అత్యంత వేగంగా పీల్చుకుంటుంది. అదే సమయంలో, నీటి ఉపరితలం నుంచి ఆక్సిజన్ అడుగు భాగానికి తగినంతగా చేరదు. దీని ఫలితంగా, ఆ ప్రాంతం మొత్తం ఆక్సిజన్ లేని (Hypoxic) మృత మండలంలా మారిపోతుంది.

ఈ పరిస్థితి సముద్ర జీవరాశికి మరణశాసనమే. ఆక్సిజన్ కొరత ఏర్పడగానే చేపలు, రొయ్యలు, పీతలు వంటి కదలగలిగే జీవులు ఆ ప్రాంతం నుంచి త్వరగా పారిపోతాయి. కానీ, అడుగున నివసించే నత్తలు, గుల్లలు (Clams), అనేక ఇతర చిన్న జీవులు మాత్రం అక్కడే ఉండి సామూహికంగా మరణిస్తాయి. డెడ్ జోన్స్(Dead zones) ఏర్పడటం వల్ల కోట్లాది రూపాయల మత్స్య పరిశ్రమ దెబ్బతింటుంది. అలాగే మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. మెక్సికో గల్ఫ్ (మిస్సిస్సిప్పి నది కారణంగా), బాల్టిక్ సముద్రం, చెసపీక్ బే వంటి ప్రాంతాలలో ఈ డెడ్ జోన్స్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ ఉండటం నేడు పర్యావరణవేత్తలకు ఒక పెద్ద సవాలుగా మారింది. మన భూ వినియోగ విధానాలను మార్చుకుంటేనే ఈ అంతుచిక్కని మరణ మండలాన్ని అరికట్టగలం.

Telangana:తెలంగాణ పల్లెల్లో ఇక ఎన్నికల జాతర షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Exit mobile version