BRICS
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలు వివాదాస్పద నిర్ణయాలతో ముఖ్యంగా బ్రిక్స్ (BRICS ) దేశాలను టార్గెట్ చేశారు. అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెస్తే 150 శాతం టారిఫ్స్ విధిస్తానని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అయితే డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెచ్చే ఆలోచన తమకు లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. కానీ ట్రంప్ దూకుడు చూసిన తర్వాత నిర్ణయం మార్చుకున్న భారత్ డాలర్‌కు చెక్ పెట్టే వ్యూహాలకు పదును పెడుతోంది.
ఇటీవలే ఆర్‌బీఐ చేసిన కీలక ప్రతిపాదనే దీనికి ఉదాహరణ. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత ఈజీ చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది. బ్రిక్స్(BRICS) సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించినట్లు సమాచారం. తద్వారా అంతర్జాతీయ లావాదేవీలలో అమెరికన్ డాలర్‌పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉంది.
దీనిలో భాగంగా ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగబోతున్న బ్రిక్స్ (BRICS) సదస్సులో సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది బ్రెజిల్‌లోని రియోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య పరస్పర అనుకూలతకు సంబంధించి ప్రతిపాదన పెట్టారు.
ఇప్పుడు తాజా ఆర్‌బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ (BRICS) దేశాల్లో ఏదీ పూర్తిస్థాయిలో డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేయలేదు. అయినప్పటికీ ఐదు ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తన డిజిటల్ కరెన్సీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం అంతర్జాతీయ లావాదేవీలు ఎక్కువగా అమెరికా నియంత్రణలోని స్విఫ్ట్ నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్నాయి. బ్రిక్స్ (BRICS) సభ్యదేశాలు తమ డిజిటల్ కరెన్సీలను అనుసంధానించడం ద్వారా నేరుగా డిజిటల్ రోడ్‌ను ఏర్పాటు చేసుకుంటాయి, దీనివల్ల స్విఫ్ట్ అవసరం లేకుండానే లావాదేవీలు పూర్తి చేయొచ్చు. ఈ విధానం వల్ల సభ్య దేశాలు తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం చేసుకుంటాయి. దీనివల్ల ప్రతి లావాదేవీనీ డాలర్లలోకి మార్చాల్సిన అవసరం తప్పుతుంది.
డాలర్ మధ్యవర్తిత్వం లేకపోవడం వల్ల కరెన్సీ మార్పిడి ఖర్చు 3-5శాతం వరకు తగ్గుతుంది. చెల్లింపులు కూడా రోజుల వ్యవధిలో కాకుండా సెకన్లలోనే పూర్తవుతాయి. అమెరికా తరచుగా డాలర్ వ్యవస్థను ఉపయోగించి ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుంటుంది. బ్రిక్స్ దేశాల సొంత చెల్లింపు వ్యవస్థ ద్వారా అగ్ర రాజ్యానికి చెక్ పెట్టొచ్చు.సుంకాలు పేరుతో బెదిరిస్తున్న ట్రంప్‌కు ఇది గట్టి షాక్ ఇవ్వనుంది.
NATO:వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్..గ్రీన్‌లాండ్ విషయంలో నాటోతో ఒప్పందం అందుకేనా?
