Air ticket
పౌర విమానయాన ప్రయాణీకులకు టికెట్(Air ticket) రీఫండ్‌లు ,క్యాన్సిలేషన్‌లకు సంబంధించిన సమస్యలు ఎప్పటినుంచో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా ఏవియేషన్ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), టికెట్ రీఫండ్ నిబంధనలలో (CAR – Civil Aviation Requirement) కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పులు అమలులోకి వస్తే, ప్రయాణీకులకు టికెట్ బుకింగ్, రద్దు ప్రక్రియలోపెద్ద ఉపశమనం లభించనుంది
48 గంటల్లో ఉచిత రద్దు- లుక్-ఇన్ ఆప్షన్..
DGCA ప్రతిపాదించిన మార్పులలో అత్యంత ముఖ్యమైనది , ప్రయాణీకులకు మేలు చేసేది ‘లుక్-ఇన్ ఆప్షన్’ (Look-in Option). టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల వ్యవధి వరకు, ప్రయాణీకులు తమ టికెట్(Air ticket)ను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రద్దు చేసుకోవడానికి లేదా మార్పు చేసుకోవడానికి విమానయాన సంస్థలు అనుమతించాలి.
టికెట్ మార్పు (Amendment) చేసుకుంటే మాత్రం, సవరించిన విమానానికి (Revised Flight) వర్తించే సాధారణ ఛార్జీని (Prevailing Fare) మాత్రమే ప్రయాణీకుడు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ 48 గంటల ఉచిత రద్దు సదుపాయం, విమానం బయలుదేరడానికి దేశీయ విమానాలకు 5 రోజులు,అంతర్జాతీయ విమానాలకు 15 రోజుల లోపు ఉంటే వర్తించదు. ఈ నిబంధనలు విమాన సంస్థ వెబ్‌సైట్ ద్వారా నేరుగా బుక్ చేసుకున్న టికెట్‌లకు మాత్రమే వర్తిస్తాయి.
48 గంటల ప్రారంభ బుకింగ్ సమయం దాటిన తర్వాత, ప్రయాణీకుడు టికెట్ మార్పు లేదా రద్దు చేయదలిస్తే, సంబంధిత రద్దు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా టికెట్ బుక్ చేసేటప్పుడు పేరులో అక్షర దోషాలు (Spelling Mistakes) రావడం సాధారణం. దీనికి సంబంధించిన అదనపు ఛార్జీలను తగ్గించడానికి DGCA ప్రతిపాదించిన మార్పులు కూడా ఉన్నాయి.
ప్రయాణీకుడు టికెట్ బుక్ చేసిన 24 గంటలలోపు పేరులో ఉన్న లోపాన్ని (Error) గుర్తించి, దానిని సరిచేయమని సూచిస్తే, విమానయాన సంస్థ ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. ఈ సదుపాయం కూడా విమాన సంస్థ వెబ్‌సైట్ ద్వారా నేరుగా బుక్ చేసుకున్న టికెట్‌లకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రయాణీకులు ట్రావెల్ ఏజెంట్లు లేదా ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా టికెట్లు(Air ticket) బుక్ చేసినప్పుడు, రద్దు జరిగినప్పుడు రీఫండ్ ఆలస్యం లేదా రిజక్ట్ చేయడం జరుగుతుంది. దీనిపై స్పష్టత ఇస్తూ DGCA కీలక ప్రతిపాదన చేసింది.
ట్రావెల్ ఏజెంట్/పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన సందర్భంలో, రీఫండ్ బాధ్యత (Onus of Refund) విమానయాన సంస్థలదే. ఎందుకంటే ఆ ఏజెంట్లు విమాన సంస్థలచే నియమించబడిన ప్రతినిధులుగా పరిగణించబడతారు. విమానయాన సంస్థలు రీఫండ్ ప్రక్రియను 21 పని దినాలలోపు (21 Working Days) పూర్తి చేసేలా చూడాలి.
మరొక ముఖ్యమైన ప్రతిపాదన ప్రకారం, ప్రయాణీకుడు వైద్య అత్యవసర పరిస్థితి (Medical Emergency) కారణంగా టికెట్‌ను రద్దు చేసుకుంటే..విమానయాన సంస్థలు టికెట్‌ను రీఫండ్ చేయొచ్చు లేదా ప్రయాణీకుడు భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు క్రెడిట్ షెల్ (Credit Shell) ను అందించొచ్చు. ఇది ప్రయాణీకులకు ఊహించని పరిస్థితుల్లో ఆర్థిక భద్రతను ఇస్తుంది.
DGCA ప్రతిపాదించిన ఈ ముసాయిదా నిబంధనలపై (Draft CAR) వాటాదారులు (Stakeholders) తమ అభిప్రాయాలను తెలియజేయడానికి నవంబర్ 30 వరకు గడువు కూడా ఇవ్వడంతో చాలామంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. DGCA నిబంధనల మార్పుపై అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుందని తెలుస్తోంది.
