Artificial stars
ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోని సుదూర రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు భూ వాతావరణం. భూమికి దగ్గరగా ఉండే వాతావరణ పొరల్లోని కదలికలు, ఉష్ణోగ్రత మార్పుల వల్ల నక్షత్రాల నుంచి వచ్చే కాంతి వక్రీకరించి, టెలిస్కోపుల్లోని చిత్రాలు అస్పష్టంగా, నాణ్యత లేకుండా కనిపిస్తాయి. ఈ వక్రీకరణ కారణంగా నక్షత్రాలు మెరిసిపోతున్నట్లు (Twinkling) అనిపిస్తాయి. ఇదే అతిపెద్ద ఆటంకం. ఈ సమస్యను అధిగమించడానికి, శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన, అద్భుతమైన టెక్నాలజీని వాడుతున్నారు.. అదే భూమిపై నుంచే కృత్రిమ నక్షత్రాలను (Artificial Stars) తయారుచేయడం!
ఈ సాంకేతిక అద్భుతం ఎలా సాధ్యమవుతుందంటే, భూమిపై ఉండే అత్యంత శక్తివంతమైన లేజర్లను (Lasers) ఉపయోగించి, ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశంలో దాదాపు 90 కిలోమీటర్ల ఎత్తులో ఉండే సోడియం అణువులను ఉత్తేజితం చేస్తారు. మన వాతావరణంలోని ఈ ఎత్తైన పొరలో, సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల సహజంగానే కొంత సోడియం ఉంటుంది. ఈ సోడియం పొర, లేజర్ తాకగానే ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఈ ఉద్దీపన కారణంగా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన, చిన్న కాంతి బిందువు ఏర్పడుతుంది. ఇది అచ్చం ఒక సహజ నక్షత్రంలా కనిపిస్తుంది కాబట్టి, వీటిని లేజర్ గైడ్ స్టార్స్ అని పిలుస్తారు.
ఈ కృత్రిమ నక్షత్రాన్ని(Artificial stars) రిఫరెన్స్‌గా తీసుకుని, టెలిస్కోపులకు అమర్చబడిన అడాప్టివ్ ఆప్టిక్స్ అనే సాంకేతికత రంగంలోకి దిగుతుంది. ఈ వ్యవస్థలో టెలిస్కోప్ యొక్క అద్దం వెనుక అనేక వేల చిన్న యాక్చుయేటర్‌లు (Actuators) ఉంటాయి. ఇవి వాతావరణం వల్ల కలిగే కాంతి వక్రీకరణను సెకనుకు వేలసార్లు పసిగట్టి, ఆ అద్దాన్ని వేగంగా, కచ్చితంగా మార్చగలుగుతాయి.
ఉదాహరణకు, వాతావరణం కాంతిని ఒక వైపు వంచితే, అడాప్టివ్ ఆప్టిక్స్ ఆ అద్దాన్ని దాని వ్యతిరేక దిశలో వంచి, వక్రీకరణను తక్షణమే రద్దు చేస్తాయి. దీనివల్ల, వాతావరణంలోని కదలికలు, గాలి ప్రవాహాలు ఎంతగా ఉన్నా కూడా, నిజమైన నక్షత్రాలు , గ్రహాల చిత్రాలు అత్యంత స్పష్టంగా, HD క్వాలిటీతో కనిపిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ ఒక చిన్నపాటి మిరాకిల్ (అద్భుతం) లాంటిది. ఈ సాంకేతికత ద్వారానే అంతరిక్షంలోని అత్యంత రహస్యాలు, మసకబారిన గెలాక్సీల నిర్మాణం, కొత్త గ్రహాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్‌గా మారింది.