Solar eclipse: ఆరు నిమిషాలకు పైగా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తారా? అయితే కాస్త వెయిట్ చేయాలట

Solar eclipse: ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల పాటు కొనసాగే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం కావడం విశేషం.

Solar eclipse

సాధారణంగా మనం చూసే సూర్యగ్రహణాలు(Solar eclipse) కేవలం కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు మాత్రమే కనిపిస్తాయి. కానీ, 2027 ఆగస్టు 2వ తేదీన ఒక అపూర్వమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇది ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల పాటు కొనసాగే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం(solar eclipse) కావడం విశేషం. ఈ శతాబ్దంలో పగటి పూట ఇంతటి సుదీర్ఘమైన చీకటిని భూమిపై చూడటం చాలా అరుదుగా జరుగుతుందని అంతరిక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ అరుదైన గ్రహణాన్ని యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య ప్రాంతాల మీదుగా వీక్షించే అవకాశం ఉంది.

గ్రహణం ప్రయాణం,చీకటి మయం..సూర్యగ్రహణం అంటే, సూర్యుడు , భూమి మధ్యలోకి చంద్రుడు రావడమే. ఈ క్రమంలో చంద్రుడి నీడ భూమిపై పడి, సూర్యుడి కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది.

Solar eclipse

ఈ సుదీర్ఘ గ్రహణం మొదట అట్లాంటిక్ మహాసముద్రంపై తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, జిబ్రాల్టార్ స్ట్రెయిట్ సమీపంలో భూభాగాన్ని తాకుతుంది. అక్కడి నుంచి ఈ సంపూర్ణ చీకటి పట్టీ స్పెయిన్ దక్షిణ భాగం, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్ దేశాల మీదుగా ప్రయాణించి, చివరకు మధ్యప్రాచ్య ప్రాంతంలోకి వెళుతుంది.

ఈ గ్రహణం కేంద్రరేఖపై ఉన్న ప్రాంతాలలో, ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల పాటు పూర్తి చీకటి ఆవరించి ఉంటుంది. ఈ కాలంలో, సూర్యరశ్మి పూర్తిగా భూమిని చేరదు. ఖగోళ రికార్డుల ప్రకారం, 1991 నుంచి 2114 మధ్య భూభాగంపై కనిపించే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం దీని ప్రత్యేకత. ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రజలు కేవలం పాక్షిక సూర్యగ్రహణాన్ని మాత్రమే చూడగలుగుతారు.

విస్మయపరిచే దృశ్యాలు,మార్పులు.. సంపూర్ణ సూర్యగ్రహణం కేవలం చీకటిని మాత్రమే తీసుకురాదు, అద్భుతమైన శాస్త్రీయ దృశ్యాలను , ప్రకృతిలో మార్పులను కూడా మనం గమనించవచ్చు. ఆకస్మికంగా సూర్యరశ్మి ఆగిపోవడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. గాలి వీచే తీరులో కూడా స్వల్ప మార్పులు వస్తాయి.

జంతువులు, పక్షులు పగటిపూట ఆకస్మికంగా చీకటి పడటంతో అయోమయానికి గురై, రాత్రి అయ్యిందనే భ్రమలో తమ ప్రవర్తనలో మార్పులు చూపిస్తాయి.ఆకాశం పూర్తిగా చీకటి పడటం వల్ల, పగటిపూట కనిపించని శుక్రుడు (వీనస్), బుధుడు (మెర్క్యురీ) వంటి ప్రకాశవంతమైన గ్రహాలు అకస్మాత్తుగా ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తాయి.

Solar eclipse

ఈ గ్రహణం సమయంలో కనిపించే అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ‘డైమండ్‌ రింగ్‌’ ఎఫెక్ట్ ఒకటి. సంపూర్ణ గ్రహణం ముగిసే సమయానికి, చంద్రుడి అంచు నుంచి సూర్యుడి వెలుగు ఒక్క చిన్న ప్రకాశవంతమైన బిందువుగా కనిపించి, ఒక వజ్రపు ఉంగరం (డైమండ్‌ రింగ్‌) రూపాన్ని తలపిస్తుంది.

అలాగే, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసినప్పుడు, సూర్యుడి ఉపరితలం చుట్టూ ఉన్న మండుతున్న వలయం, అంటే ‘సూర్య కరోనా’ (Solar Corona) నగ్న కళ్లతో కనిపిస్తుంది. ఇది సాధారణ రోజుల్లో సూర్య కాంతి తీవ్రత వల్ల కనిపించదు.

ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఎక్కడో ఒకచోట సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినా కూడా, ఇది ఆరు నిమిషాలకు పైగా అనేక జనసమ్మర్ద ప్రాంతాల మీదుగా వెళ్లడం చాలా అరుదు. అందుకే 2027 ఆగస్టు 2న ఏర్పడే ఈ గ్రహణం(Solar eclipse) ఖగోళ శాస్త్రవేత్తలకు , స్కై వాచర్‌లకు ఒక ప్రధాన గ్లోబల్ ఈవెంట్‌గా మారబోతోంది.

Herbs: ఆ అద్భుత మూలికలతో బోలెడు లాభాలున్నాయట..

Exit mobile version