Trump:మారుతున్న ట్రంప్ వైఖరి..మోదీపై సానుకూల వ్యాఖ్యలు దేనికి సంకేతం?

Trump: భారత్‌పై విమర్శలు చేసి, సుంకాల భారం మోపిన ట్రంప్, ఇప్పుడు భారత్‌తో తమ సంబంధం 'చాలా ప్రత్యేకమైనది' అని పేర్కొనడం గమనార్హం.

Trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump) ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల సంబంధాలపై కొత్త చర్చను లేవనెత్తాయి. భారత్‌పై విమర్శలు చేసి, సుంకాల భారం మోపిన ట్రంప్, ఇప్పుడు భారత్‌తో తమ సంబంధం ‘చాలా ప్రత్యేకమైనది’ అని పేర్కొనడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రధాని మోదీ వెంటనే స్పందిస్తూ, ట్రంప్ అంచనాను తాను అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు.

కొంతకాలంగా డోనాల్డ్ ట్రంప్(Trump) భారత్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో భారత్‌పై అదనపు సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో భారత్ – అమెరికా సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి.

ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో కలిసి ఉన్న ఫోటోపై ట్రంప్ స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో మేము ఇండియాను, రష్యాను చీకటి దేశమైన చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోంది అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఆ మూడు దేశాలు సుసంపన్న భవిష్యత్తును పొందాలని ఎద్దేవా చేశారు.

Trump

అయితే, ఈ సంఘటన తర్వాత ట్రంప్ వైఖరిలో ఆకస్మిక మార్పు వచ్చింది. వైట్ హౌస్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో, భారత్‌తో సంబంధాలను పునరుద్ధరిస్తారా అనే ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. నేను ఎల్లప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటాను. ఆయన గొప్ప ప్రధాన మంత్రి అని ప్రశంసించారు. భారతదేశం – అమెరికాల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు.

తాను గతంలో చేసిన విమర్శలను ట్రంప్ ఈ మీడియా సమావేశంలో తోసిపుచ్చారు. రష్యా నుంచి భారత్ అధిక చమురు కొనుగోలు చేయడంపై తాను నిరాశ చెందానని అంగీకరించినా.. తమ మధ్య సంబంధాలు చెడిపోలేదని స్పష్టం చేశారు. నేను వారికి ఈ విషయాన్ని చెప్పాను. మేము భారతదేశంపై 50 శాతం భారీ టారిఫ్ విధించాము.. అయినా నాకు, మోదీకి చాలా మంచి సంబంధం ఉందని అన్నారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రధాని మోదీ తన ‘ఎక్స్‌’ అకౌంట్‌లో స్పందించారు. ట్రంప్ అభిప్రాయాలను, రెండు దేశాల సంబంధాలపై ఆయన సానుకూల దృక్పథాన్ని తాను ఎంతో అభినందిస్తున్నానని తెలిపారు. భారతదేశం – అమెరికా మధ్య ఉన్నది ఒక సానుకూలమైన, ముందుచూపు గల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అని మోదీ పేర్కొన్నారు. ఈ విధంగా రెండు దేశాల మధ్య ఏర్పడిన అపార్థాలను తొలగిస్తూ, సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ అడుగులు వేస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే డోనాల్డ్ ట్రంప్ (Trump)తన రాజకీయ జీవితంలో తరచుగా ఒకే అంశంపై రెండు భిన్నమైన వైఖరులు తీసుకోవడం కనిపిస్తుంది. ఒకవైపు, అమెరికాకు ఆర్థికంగా లాభం జరగాలనే పేరుతో ఇతర దేశాలపై సుంకాలు విధిస్తారు. మరోవైపు, కీలకమైన సమయంలో ఆ దేశంతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

MiG-21: ఆరు దశాబ్దాల సేవలు..మిగ్-21కి వీడ్కోలు

Exit mobile version