Trump
2025లో ట్రంప్ (Trump)పాలన తిరిగి మొదలైన తర్వాత, అమెరికాలో వలస చట్టాలు గణనీయంగా కఠినంగా మారాయి. వీసా హోల్డర్లు, కొత్త వలసదారులపై నియంత్రణలు, ఆంక్షలు, పలు విధాన మార్పులు వేగంగా అమల్లోకి వచ్చాయి. ప్రొటక్టింగ్ ది అమెరికన్, అమెరికన్ పీపుల్ అగైనిస్ట్ ఇన్వేషన్( Protecting The American American People Against Invasion) అనే జాతీయ ప్రకటన ద్వారా, దక్షిణ సరిహద్దుల వద్ద శరణార్థులు, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు మొదలయ్యాయి.
విధానాలలో వచ్చిన ముఖ్యమైన మార్పులను ఒకసారి గమనిస్తే.. మైగ్రేంట్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్ (Migrant Protection Protocols) పునరుద్ధరణ జరిగింది దక్షిణ సరిహద్దు వద్ద ఆశ్రయం కోరేవారిని అమెరికాలోకి అనుమతించకుండా, వారు తమ కోర్టు విచారణ కోసం మెక్సికోలోనే వేచి ఉండేలా ఈ విధానాన్ని తిరిగి అమలులోకి తెచ్చారు.
క్యాచ్ అండ్ డిటైన్ (Catch-and-Detain) విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న క్యాచ్ అండ్ రిలీజ్ (catch and release) విధానానికి ముగింపు పలికి, అక్రమ వలసదారులను కోర్టు విచారణ పూర్తయ్యే వరకు డిటెన్షన్ సెంటర్లలోనే ఉంచాలనే కఠినమైన విధానాన్ని ప్రవేశపెట్టారు.
స్థానిక పోలీసులకు ఇమ్మిగ్రేషన్ అధికారం ఇచ్చారు. క్రిమినల్ కేసులు ఉన్న వీసా హోల్డర్లను, అక్రమంగా నివసిస్తున్న వారిని పట్టుకోవడానికి స్థానిక పోలీసులకు కూడా ఇమ్మిగ్రేషన్ అధికారాన్ని ఇచ్చే ఆదేశాలు జారీ అయ్యాయి.
వీసా దరఖాస్తులలో సోషల్ మీడియా తనిఖీలు పెరిగాయి. కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసేవారి సోషల్ మీడియా ఖాతాలు అన్ని “పబ్లిక్”గా ఉండాలనే కొత్త నియమాలు అమ ల్లోకి వచ్చాయి. గతంలో వీసా పొందిన వారి వివరాలు కూడా క్షుణ్ణంగా సమీక్షించబడుతున్నాయి.
తాత్కాలిక ప్రయాణ, వీసా నిషేధాలు అమలయ్యాయి. చైనా, ఇరాన్ వంటి కొన్ని దేశాలపై తాత్కాలిక ప్రయాణ, వీసా నిషేధాలు విధించబడ్డాయి. ఇది కొంతవరకు భారతదేశంపైనా ప్రభావం చూపింది.
అసైలం, రెఫ్యూజీ నిబంధనల కఠినతరం చేశారు. అక్రమంగా నివసించే వారిని వెంటనే తిప్పి పంపడానికి, అసైలం , రెఫ్యూజీ స్టేటస్లను భారీగా కఠినతరం చేశారు. అనేక వలస , శరణార్థుల కార్యక్రమాలను రద్దు చేశారు.
ఈ మార్పులు అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపాయి.వ్యాపార, ఉద్యోగ వీసాదారులలో అయోమయం నెలకొంది. సుమారు 55 మిలియన్ల మంది వీసా హోల్డర్లు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు, విద్యార్థులు, ఉద్యోగ వీసాధారులు పెద్ద గందరగోళంలో ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఇ చ్చిన వీసాలు కూడా ఇప్పుడు సమీక్షకు గురవుతున్నాయి.
అసైలం కోరేవారు అంటే మానవతా దృక్పథంతో ఆశ్రయం కోసం వచ్చిన వారికి కూడా ఇప్పుడు ఎంతో కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
విస్తృత నిర్బంధ అధికారం పెరిగింది. దేశవ్యాప్తంగా భద్రతా ఉత్తర్వుల పేరుతో, ఏ రాష్ట్రంలోనైనా పోలీస్ అధికారులు అనుమానాస్పదంగా ఉన్న వారిని నిర్బంధించే అధికారం లభించింది.
అయితే ఈ మార్పుల పట్ల ప్రతిపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, అమెరికా వ్యాపార సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలపైన, విద్యార్థుల ‘అమెరికా డ్రీమ్’పైన ఈ మార్పులు సమగ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
మొత్తం మీద, 2025లో ట్రంప్(Trump) పాలనలో అమెరికా వలస-వీసా వ్యవస్థను కఠినంగా మార్చడం అనేది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఆచరణలోనూ అమలవడం మొదలైంది. ఇది వలసదారులకు, కొత్తగా వెళ్లే విద్యార్థులకు, ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు పెను మార్పులు తెచ్చింది.