Capsule Wardrobe
మనం సాధారణంగా బీరువా నిండా బట్టలు ఉన్నా, ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం అసలు ఆ సమయానికి వేసుకోవడానికి ఏమీ లేవనే ఫీలవుతుంటాం. ఈ సమస్యకు పరిష్కారమే ‘కాప్సూల్ వార్డ్రోబ్’ ( Capsule Wardrobe) . ఇది 2026లో ఎక్కువ మంది ఇష్టపడుతున్న ఒక సరికొత్త ఫ్యాషన్ పద్ధతి. వందల కొద్దీ బట్టలను బీరువాలో నింపేయకుండానే, కేవలం కొన్ని బట్టలతోనే ఎన్నో రకాల కాంబినేషన్లను సృష్టించి ప్రతిరోజూ కొత్తగా కనిపించడమే దీని అసలు ఉద్దేశం. ఇది కేవలం మన షాపింగ్ ఖర్చును తగ్గించడమే కాకుండా, సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.
కాప్సూల్ వార్డ్రోబ్ సిద్ధం చేసుకోవడంలో మొదటి సూత్రం ఏమిటంటే, ఒకదానితో ఒకటి కలిసే రంగులను , స్టైల్స్‌ను ఎంచుకోవడం. ఉదాహరణకు మీ దగ్గర ఒక వైట్ షర్ట్, ఒక బ్లాక్ ప్యాంట్, ఒక డెనిమ్ జాకెట్ , రెండు రకాల టీషర్ట్స్ ఉంటే, వాటిని మార్చి మార్చి వేసుకోవడం ద్వారా ఐదు నుంచి పది రకాల విభిన్నమైన లుక్స్‌ను పొందొచ్చు. నాణ్యత లేని వంద బట్టల కంటే, ఎక్కువ కాలం మన్నే , ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండే నాణ్యమైన పది జతల బట్టలను ఎంచుకోవడమే ఈ పద్ధతిలోని అసలైన రహస్యం అంటారు నిపుణులు. దీనివల్ల మన బీరువా ఎప్పుడూ గందరగోళం లేకుండా క్లీన్‌గా ఉంటుంది.
ఈ పద్ధతి వల్ల ఆర్థికంగా కూడా చాలా లాభాలు ఉన్నాయంటారు నిపుణులు. అనవసరమైన బట్టలను కొని డబ్బు వృధా చేయకుండా, అవసరమైన వాటినే కొంటాం కాబట్టి షాపింగ్ ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది. అలాగే ప్రతిరోజూ ఏ డ్రెస్ వేసుకోవాలి అనే ఆలోచనతో గంటల తరబడి సమయం కూడా వృధా అవ్వదు. ‘సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్’ అనే సూత్రాన్ని ఫాలో అవుతూ, చాలా స్టైలిష్‌గా కనిపించడానికి ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తక్కువ బట్టలతోనే ఎక్కువ రోజులు ఉండటానికి కాప్సూల్ వార్డ్రోబ్ బాగా ఉపయోగపడుతుంది.
బట్టల పరిశ్రమ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో మనవంతు సహాయం చేసినట్లు అవుతుంది కాబట్టి..పర్యావరణం పట్ల బాధ్యత ఉన్న వారు కూడా ఈ పద్ధతిని ఎక్కువగానే ఇష్టపడుతున్నారు. ముందు మీ బీరువాలో ఉన్న బట్టలన్నీ తీసి, మీకు అస్సలు నచ్చనివి, మీకు పట్టనివి వేరు చేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బట్టలతోనే ఎన్ని రకాల కాంబినేషన్లు వస్తున్నాయో చూసుకోండి. మీ పర్సనాలిటీకి సరిపోయే రంగులను ఎంచుకుని ఒక కాప్సూల్ వార్డ్రోబ్‌ను ప్లాన్ చేసుకోండి. 2026లో ట్రెండీగా ఉండాలంటే ఎక్కువ బట్టలు కాదని, సరైన బట్టలు ఉండాలని గుర్తు పెట్టుకోండి.
Moringa :సూపర్ డ్రింక్ మునగాకు టీ.. బరువు తగ్గడమే కాదు ఇంకా ఎన్నో ఉపయోగాలు..
