Visa
అమెరికాలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో వ్యవహరిస్తున్న ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీసా జారీ విషయంలో విదేశీయులకు మరోసారి షాకిచ్చింది. అమెరికా వీసా(Visas) పొందాలంటే అంత ఈజీ కాదన్న రీతిలో ఈ నిర్ణయముంది. విదేశాల నుంచి వచ్చే వారికి వీసాను ఇచ్చే విషయంలో మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను రిజెక్ట్ చేసే కొత్త రూల్ ప్రవేశపెట్టారు. సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేకునే వారి ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేస్తారు.
US రాయబార కార్యాలయం ఆమోదించిన డాక్టర్ ఈ వైద్య పరీక్షలు చేస్తారు. ఇక్కడ క్లీన్ సర్టిఫికేట్ వస్తేనే వీసాకు గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది. ఇకపై సాధారణ వైద్యపరీక్షలు చేసినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మాత్రం వీసా రాదు. ఊబకాయం, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వారిని అమెరికా వచ్చేందుకు గానీ, ఉండేందుకు గానీ అనుమతించొద్దని అమెరికా విదేశాంగశాఖ తమ ఎంబసీ కార్యాలయాలకు ఆదేశాలిచ్చింది.
గతంలో ఆరోగ్య పరీక్షల జాబితాలో ఇవన్నీ లేవు. ఇప్పుడు ఈ నిబంధనలు సవరించి కొత్త వ్యాధులను చేర్చారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని అనుమతిస్తే అమెరికా ఖజానాపై భారం పెరుగుతుందా అన్న కోణంలోనూ ఆలోచించి వీసా(Visas) జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎవరికైనా ఇలాంటి దీర్ఘకాలిన, మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే వారిని వారి సంరక్షణ కోసం ప్రభుత్వం లక్షల డాలర్లు ఖర్ఛు చేయాల్సి ఉంటుంది. అందుకే వీసా జారీలో ఈ కొత్త రూల్స్ చేర్చినట్టు సమాచారం.
అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈ రూల్ పబ్లిక్ ఛార్జ్ విధానంపై ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వ సహాయం లేకుండా, వీసా(Visas) అప్లికెంట్ జీవితాంతం తన వైద్యఖర్చులను భరించగలడా అన్న కోణంలోనూ చెక్ చేస్తారు. దానికి దరఖాస్తుదారుడు నుంచి హామీ పత్రం తీసుకుని వీసా జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే వీసా జారీ ఈ కొత్త రూల్ కారణంగా ఉద్యోగులు, స్టూడెంట్లు మాత్రమే కాకుండా దాదాపు అందరిపైనా ప్రభావం చూపే అవకాశముంది. పర్యాటక వీసా జారీలో ఈ రూల్ అమలు చేస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.
