Kuwait: ఆ 21 మంది ఒకేసారి ఎందుకు చూపు కోల్పోయారు ..?

Kuwait: దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ కేంద్రం నుంచే కల్తీ మద్యం పంపిణీ అయినట్లు దర్యాప్తులో తేలింది.

Kuwait

కువైట్‌లో జరిగిన ఒక విషాదం ఇప్పుడు యావత్ దేశాన్ని భయపెడుతోంది. కల్తీ మద్యం సేవించి 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, వారిలో చాలామంది ఆసియా దేశాలకు చెందినవారు. అంతేకాదు 21 మంది చూపు కోల్పోయారు.ఈ దుర్ఘటనలో మొత్తం 63 మంది విషప్రయోగం బారిన పడ్డారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మద్యనిషేధం ఉన్న కువైట్‌(Kuwait) లో అక్రమంగా కొనసాగుతున్న ఈ వ్యాపారం అమాయకుల జీవితాలతో ఆడుకుంటోందని ఈ దారుణ ఘటన మరోసారి రుజువు చేసింది. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించగా, ఈ విషాదం వెనుక ఉన్న వివరాలు అందరినీ కలవరపెడుతున్నాయి.

కువైట్ సిటీలో కల్తీ మద్యం విషాదంలో మరణించిన వారిలో మలయాళీ, తమిళీ, నేపాలీ ,ఇతర ఆసియా దేశాల పౌరులు ఉన్నారని సమాచారం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మిథనాల్ కలిపిన ఈ కల్తీ మద్యం సేవించిన 31 మందికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవగా, వారికి వెంటిలేటర్ల సహాయంతో చికిత్స అందిస్తున్నారు.

మరో 51 మందికి అత్యవసరంగా మూత్రపిండాల డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. ఈ విషపూరిత మద్యం ఎంత ప్రమాదకరమైనదో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ దారుణ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జిలీబ్ అల్ షుయూక్ బ్లాక్ 4లో అక్రమ మద్యం తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు ఆసియా ప్రవాసులను అధికారులు అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ కేంద్రం నుంచే కల్తీ మద్యం పంపిణీ అయినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కువైట్‌(Kuwait)లో మద్యం అమ్మకాలు నిషేధించబడినా..బ్లాక్ మార్కెట్‌లో ఇలాంటి అక్రమ తయారీ కేంద్రాలు పనిచేస్తుండటం ఈ ఘటనతో మరోసారి వెల్లడైంది.

Kuwait

ఈ విషాద సంఘటనతో కువైట్(Kuwait) అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. అక్రమ మద్యం కేంద్రాలను మూసివేస్తూ, అనుమానిత ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచింది. ప్రజల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అక్రమ మద్యం గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రభుత్వం హెచ్చరించింది.

మిథనాల్(Methanol) కలిగిన మద్యం ప్రాణాంతకమని, అనధికారికంగా లభించే ఎలాంటి మద్యం సేవించవద్దని ఆరోగ్య నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు, నిఘా పెంచాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.

Also Read: OTT: ఓ వైపు వరుస సెలవులు.. మరోవైపు ఓటీటీ బొనాంజా

Exit mobile version