Bangladesh
బంగ్లాదేశ్ అంటే రాజకీయ నేతల ఎత్తులు పైఎత్తులు కంటే.. రెండు కుటుంబాల మధ్య సాగే రాజకీయ యుద్ధం అని అందరికీ గుర్తుకువస్తుంది. వాటిలో ఒకటి అవామీ లీగ్‌కు చెందిన షేక్ హసీనా కుటుంబం కాగా..రెండోది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి చెందిన ఖలీదా జియా కుటుంబం. 15 ఏళ్లుగా షేక్ హసీనా సాగించిన పాలన తర్వాత..తాజాగా విద్యార్థుల రిజర్వేషన్ల పోరాటం ఒక్కసారిగా ప్రజా తిరుగుబాటుగా మారి పోయింది. దీంతో ఆమె ఏకంగా దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలే ఇప్పుడు బంగ్లాదేశ్(Bangladesh)లో జియా శకం మళ్లీ మొదలైందన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
అసలు ఈ జియా బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే బంగ్లాదేశ్(Bangladesh )మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ బీఎన్‌పీ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన చనిపోయాక ఆయన భార్య ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే షేక్ హసీనా అధికారంలోకి వచ్చాక.. ఖలీదా జియా అనేక ఏళ్లు జైలు శిక్ష, గృహ నిర్బంధంలో గడిపారు. ఇప్పుడు హసీనా దేశం వదిలి పారిపోవడంతో, ఖలీదా జియాను ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి తోడు లండన్‌లో ప్రవాసంలో ఉన్న ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారు. దీంతో దేశం మళ్లీ జియా కుటుంబం వైపు మొగ్గు చూపుతోందని భావిస్తున్నారు.
ఈ వార్తల మధ్య అసలు షేక్ హసీనా ఒక ధీరవనితా? లేక నిరంకుశ పాలకురాలా అన్న ప్రశ్న చాలామందిని అయోమయంలో పడేస్తుంది.నిజానికి షేక్ హసీనా జీవితం ఒక సినిమా స్టోరీలో ఉంటుంది. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ (బంగ్లాదేశ్ జాతిపిత)తో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ సైనిక తిరుగుబాటులో కోల్పోయారు. ఆసమయంలో ఆమె ప్రాణాలతో మిగిలింది ఆమె అదృష్టం కొద్దీ అప్పుడు విదేశాల్లో ఉండటం వల్లనే. ఆ బాధను దిగమింగుకుని, మళ్లీ దేశానికి వచ్చి, ప్రజాస్వామ్యం కోసం పోరాడి ఒక ధీరవనితలా అధికారాన్ని చేపట్టారు.
హసీనా హయాంలో బంగ్లాదేశ్(Bangladesh) జీడీపీ ఓ రేంజ్‌లో పెరిగింది. పేద దేశం అన్న బంగ్లాదేశ్ ముద్రను పోగొట్టి, టెక్స్‌టైల్ రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానానికి తీసుకెళ్లారు. తలసరి ఆదాయంలో ఏకంగా పాకిస్తాన్‌ను కూడా దాటేశారంటేనే షేక్ హసీనా మేధావితనం ఊహించుకోవచ్చు.ఛాందసవాద శక్తులను అణచివేసి, బంగ్లాదేశ్‌ను లౌకిక బాటలో నడిపించడానికి హసీనా ఎంతో ప్రయత్నించారు.
ఆమె అధికారంలో ఉన్నంత కాలం భారత్-బంగ్లా సరిహద్దుల్లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది.హసీనా భారత దేశానికి ఆమె ఒక నమ్మకమైన మిత్రురాలు.అందుకే ఇప్పుడు దేశం పారిపోయి వచ్చి ఇండియాలో తలదాచుకున్నారు.
అయితే కాలక్రమేణా షేక్ హసీనా అధికారాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ఎంచుకున్న దారులే ఆమెను దేశ ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చాయని విశ్లేషకులు చెబుతారు.
ఖలీదా జియా వంటి రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టించడంతో పాటు BNP పార్టీ కార్యకర్తలపై దాడులు చేయించడం వంటివి కక్ష సాధింపు చర్యలతో హాసీనాపై నెగెటివిటీని పెంచాయి.
అంతేకాదు ఎన్నికల్లో వరుసగా అక్రమాలు జరిగాయని, ప్రజల ఓటు హక్కును కూడా ఆమె కాలరాశారని విపక్షాలు ఆరోపించాయి. ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని సైన్యం లేదా పోలీసు బలంతో అణచివేయాలని చూడటం అయితే ఆమె చేసిన పెద్ద తప్పుగా విశ్లేషకులు చెబుతారు. విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని రజాకార్ల చర్యగా అభివర్ణించడమే ఆ నిప్పుకు ఆజ్యం పోసినట్లయింది.
ఒకప్పుడు బంగ్లాదేశ్‌ను(Bangladesh) కాపాడిన ధీశాలిగా పేరు తెచ్చుకున్న హసీనా.. అధికారం మీద మక్కువతో ప్రజల నాడిని పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. అధికారం ఎక్కువ కాలం ఒకే చోట ఉంటే.. ఎంతటి గొప్ప నాయకులైనా ప్రజలకు దూరమవుతారనే దానికి హసీనా జీవితం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కాగా ఇప్పుడు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం నడుస్తోంది. అయితే, త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ విజయం సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో చాలా మార్పులు వస్తాయి.
మరోవైపు షేక్ హసీనా భారత్‌కు మిత్రురాలు కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఎటువంటి చిక్కులు రాలేదు. కానీ జియా కుటుంబం పాకిస్తాన్ , చైనాతో సాన్నిహిత్యం కోరుకుంటూ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇది భారతదేశానికి కూడా ఒక సవాలు వంటిదే.
ఒక దేశ రాజకీయ చరిత్రలో ఒక నేత వెళ్లి మరో నేత రావడం సహజం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో ఇది కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదు..రెండు పాత శత్రుత్వం ఉన్న కుటుంబాల మధ్య జరుగుతున్న పోరాటం. అయితే జియా శకం మళ్లీ మొదలైతే బంగ్లాదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందో, లేదా మతపరమైన రాజకీయాల్లో చిక్కుకుంటుందో అన్నది ఇక కాలమే నిర్ణయిస్తుంది.
