Araku Valley:అరకు లోయ పర్యటన.. ప్రకృతి ఒడిలో మర్చిపోలేని మధుర యాత్ర

Araku Valley: అరకు వెళ్లే దారిలోనే గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది విశాఖ జిల్లాలోనే అత్యంత ఎత్తైన శిఖరం.

Araku Valley

ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం గురించి మాట్లాడగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు అరకు వ్యాలీ(Araku Valley). సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉండే ఈ లోయను ఆంధ్రా ఊటీ అని పిలుస్తారు. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. దాదాసే 58 టన్నెల్స్ (గుహలు), 84 వంతెనల మీదుగా సాగే ఈ ఆహ్లాదకర ప్రయాణంలో కిటికీలోంచి కనిపించే కొండలు, పచ్చని లోయలు కనువిందు చేస్తాయి.

అరకు వ్యాలీ(Araku Valley)లో చూడాల్సిన ప్రదేశాలలో మొదటివి అలాగే ముఖ్యమైనవి..బొర్రా గుహలు . సుమారు 150 మిలియన్ ఏళ్ల క్రితం గోస్తనీ నది ప్రవాహం వల్ల ఏర్పడిన ఈ సున్నపురాయి గుహలు భారతదేశంలోనే అతిపెద్దవిగా గుర్తించబడ్డాయి. ఇక్కడి శివలింగం ఆకారంలోని స్టాలక్టైట్స్ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి.

బొర్రాగుహల తర్వాత చూడాల్సింది కటిక జలపాతం. బొర్రా గుహలకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం దగ్గరికి.. కేవలం జీపుల ద్వారా మాత్రమే ఎవరైనా వెళ్లగలరు. 50 అడుగుల ఎత్తు నుంచి పడే ఆ నీటి ధార కింద తడిస్తే కలిగే అనుభూతి ప్రతీ ఒక్కరికీ మరుపురానిదిగా మిగులుతుంది.

అరుకు యాత్ర సమయంలో చూడాల్సిన మరో అద్భుత ప్రదేశం.. చాపరాయి. ఇది ఒక పెద్ద రాయి మీద నుంచి నీరు ప్రవహించే జలపాతాన్ని చూస్తూ ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. ఎంత పెద్దవాళ్లయినా ఇక్కడ నీటిలో ఆడుకుంటూ చిన్నపిల్లలుగా మారిపోతారు.

అలాగే స్థానిక గిరిజనులు చేసే బొంగులో చికెన్ తినడం అరకు యాత్రలో హైలైట్. ఇది అరుకు టూర్ మొత్తం ఎంజాయ్ చేసే ఫుడ్ కాబట్టి ఎక్కడిక్కడ వీటిని తయారుచేస్తున్నారు.

అలాగే అరకు వెళ్లే దారిలోనే గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది విశాఖ జిల్లాలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఇక్కడి నుంచి చూస్తే అరకు లోయ మొత్తం ఒక పచ్చని తివాచీలా కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి మంచి స్పాట్.

Araku Valley

అలాగే పద్మాపురం గార్డెన్స్ కూడా ప్రతీ ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ ట్రీ హౌస్‌లు, రకరకాల అరుదైన మొక్కలు పిల్లలకు , ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశంగా మార్చేస్తాయి.

చివరిగా కాఫీ మ్యూజియం అరకులోని మరో ఆకర్షణ. ఇక్కడ అరకు కాఫీ తయారీ విధానాన్ని డైరక్టుగా చూడటమే కాకుండా, వివిధ రకాల కాఫీలను రుచి చూడొచ్చు. ఎలాంటివారయినా అక్కడి కాఫీ రుచికి ఫిదా అవడమే కాదు అక్కడ కాఫీ పొడి కొనుక్కుని ..కొన్ని రోజులయినా ఆ కాఫీ తాగుతూ అరుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటారని కాఫీ లవర్స్ సరదాగా చెబుతూ ఉంటారు.

మొత్తంగా సింపుల్‌గా చెప్పాలంటే అరకు యాత్ర అంటే కేవలం అక్కడి చలి ప్రదేశాలను చూడటం మాత్రమే కాదు, ఆ చల్లని స్వచ్ఛమైన గాలిని, గిరిజన సంస్కృతిని అనుభవించడం అని చెప్పాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Exit mobile version