Earphones: ఇయర్‌ఫోన్స్ ఇంత డేంజరా? తాజా పరిశోధనలు ఏం చెప్పాయ్..?

Earphones: WHO అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.1 బిలియన్ల మంది యువత అధిక శబ్దం వల్ల వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఇయర్‌ఫోన్స్ వినియోగం ఒకటి.

Earphones

ఈరోజుల్లో ఇయర్‌ఫోన్స్ (Earphones) ఒక ఫ్యాషన్‌గా, నిత్యావసర వస్తువుగా మారిపోయాయి. రోడ్డుపై వెళ్లేటప్పుడు, ఆఫీసులో పనిచేసేటప్పుడు, లేదా ఇంటిపనులు చేసేటప్పుడు… ఎప్పుడూ చెవుల్లో ఏదో ఒక పాట వినిపిస్తూనే ఉండాలి. కానీ, ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని, చివరికి ప్రాణాలను కూడా ఎలా ప్రమాదంలోకి నెడుతుందో తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నివేదికలు చూశాక, ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవాలంటేనే భయపడటం ఖాయం.

ముంబైలో 747 మంది వైద్య విద్యార్థులపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, 89.3% మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో చాలామందికి చెవిలో నొప్పి, టినిటస్ (చెవిలో నిరంతరం శబ్దం వినిపించడం) వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కేవలం వినికిడి లోపం మాత్రమే కాదు, 68% మందికి తలనొప్పి, 47.1% మందికి రక్తపోటులో మార్పులు, 49.1% మందికి మానసిక అలసట, 30% మందికి జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయని ప్రపంచస్థాయి జర్నల్ ఒకటి వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.1 బిలియన్ల మంది యువత అధిక శబ్దం వల్ల వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఇయర్‌ఫోన్స్ వినియోగం ఒకటి. వాటిని తరచుగా శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా చేరి చెవి ఇన్‌ఫెక్షన్లకు కూడా కారణమవుతుందని తెలుస్తోంది.

Earphones

ఇయర్‌ఫోన్స్(Earphones) వల్ల కలిగే ఆరోగ్య సమస్యల కన్నా, బయటి ప్రపంచంతో మనకు తెగిపోయే సంబంధమే అత్యంత ప్రమాదకరమని గ్లోబల్ అఫైర్స్ డేటా చెబుతోంది. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ రోడ్డుపై వెళ్లేవారికి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం 1.7 రెట్లు ఎక్కువ. బయటి హారన్ శబ్దాలు, అప్రమత్తత కోసం వాహనాలు చేసే శబ్దాలు వినబడకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ అలవాటు మనల్ని చుట్టుపక్కల ప్రపంచం నుంచి వేరు చేసి, మనం ఏ ప్రమాదంలో ఉన్నామో తెలుసుకోకుండా చేస్తుంది.

ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే వైద్యులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. రోజుకు 1-2 గంటలకు మించి ఇయర్‌ఫోన్స్ (Earphones)వాడకూడదు.
శబ్దం స్థాయిని 60 డెసిబుల్స్ (సగం కంటే తక్కువ) లోపు ఉంచుకోవాలి.ఎక్కువసేపు వినాల్సి వస్తే మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి.రోడ్డుపై నడిచేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు ఇయర్‌ఫోన్స్ పూర్తిగా మానేయాలి.

ఈ నియమాలను పాటించకపోతే, వినికిడి లోపం, మానసిక సమస్యలు, ఇంకా రోడ్డు ప్రమాదాల రూపంలో మన ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మీ చెవులు ఒక విలువైన వరం. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే.

 

Exit mobile version