Cramps: మీకూ తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా?
Cramps: ఈ తిమ్మిర్లకు ప్రధాన కారణాల్లో ఒకటి మధుమేహం. అధిక రక్త చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతీస్తాయి. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ పరిస్థితిలో చేతులు, కాళ్లలో తరచుగా తిమ్మిర్లు వస్తాయి.

Cramps
మీరు కూర్చున్నప్పుడు లేదా ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉన్నప్పుడు కాళ్లు, చేతులు తిమ్మిర్లు(cramps) వస్తుంటాయా? అప్పుడప్పుడు ఇలా జరిగితే అది పెద్ద సమస్య కాదు. కానీ తరచూ ఈ లక్షణం కనిపిస్తుంటే మాత్రం, అది అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ తిమ్మిర్లను నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే, వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ తిమ్మిర్ల(Cramps)కు ప్రధాన కారణాల్లో ఒకటి మధుమేహం. అధిక రక్త చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతీస్తాయి. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ పరిస్థితిలో చేతులు, కాళ్లలో తరచుగా తిమ్మిర్లు వస్తాయి. ఈ లక్షణం గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది.
అలాగే, రక్త ప్రసరణ లోపం కూడా మరొక ప్రధాన కారణం. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు ఆ భాగాలకు రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో తిమ్మిర్లు వస్తాయి. ఈ పరిస్థితిలో తేలికపాటి మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. కానీ, ఇది నిత్యం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

మీరు సరిగా కూర్చోకపోవడం వల్ల వెన్నుపాము చుట్టూ నరాలపై ఒత్తిడి ఏర్పడితే, అది వెన్నుపాము సమస్యలకు దారితీయవచ్చు. ఈ ఒత్తిడి కారణంగా కూడా చేతులు, కాళ్లు (legs and arms)తిమ్మిర్లు వస్తాయి. అదేవిధంగా, థైరాయిడ్ గ్రంథుల సమస్యల వల్ల కూడా ఇలాంటి తిమ్మిర్లు వస్తుంటాయి. ఈ సమస్య ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒకరకమైన షాక్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ సమస్య ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
ఇక, చాలామంది కంప్యూటర్ ముందు ఎక్కువసేపు టైప్ చేసేవారికి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. మణికట్టు దగ్గర నరాలపై నిరంతర ఒత్తిడి పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధి యొక్క మొదటి లక్షణం కూడా చేతులు తిమ్మిర్లు రావడమే. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చివరగా, చిన్న లక్షణాలను కూడా పట్టించుకోవడం, సరైన జీవనశైలిని పాటించడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.