Fish eggs
చేపలు తినడం వల్ల రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. అందుకే చాలామంది నాన్-వెజ్ ప్రియులు చికెన్, మటన్‌తో పోలిస్తే చేపలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చేపలలో విటమిన్ ఎ, డి, ఇ వంటి పోషకాలతో పాటు, 18 నుంచి 20 శాతం వరకు మాంసకృత్తులు ఉంటాయి. అయితే, చాలామందికి చేపగుడ్ల గురించి పూర్తి అవగాహన ఉండదు. కొందరు వాటిని ఇష్టంగా తింటే, మరికొందరు తినకూడని పదార్థంగా భావిస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చేపగుడ్లు పోషకాల గని. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చేపగుడ్లలో (Fish eggs) మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే ప్రత్యేకమైన పోషకాల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చేపగుడ్లలో విటమిన్ A అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్లకు ఎలాంటి హాని కలగకుండా ఇది రక్షిస్తుంది. అలాగే, చేపగుడ్లను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో బాధపడేవారు చేపగుడ్లను తినడం వల్ల రక్తశాతం త్వరగా పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది.
చేపగుడ్ల(Fish eggs)లోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా, చేపగుడ్లలో ఉండే విటమిన్ D మన ఎముకలు, దంతాలను బలంగా, దృఢంగా మారుస్తుంది. దీనివల్ల వయసుతో వచ్చే ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. జ్ఞాపకశక్తికి కూడా చేపగుడ్లు ఎంతో మేలు చేస్తాయి. మతిమరుపు సమస్య ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు చేపగుడ్లను క్రమం తప్పకుండా తింటే మెదడు పనితీరు మెరుగుపడి మంచి ఫలితం ఉంటుంది. బీపీ సమస్య ఉన్నవారు చేపగుడ్లను తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
చేపగుడ్ల(Fish eggs)ను కూరగా వండుకోవచ్చు లేదా ఫ్రై రూపంలో చేసుకోవచ్చు. సాధారణ చేపల కూర వండేటప్పుడు చేపగుడ్లను అందులో వేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే రుచికరంగా ఉంటాయి. మొత్తంగా, చేపగుడ్లు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన ఆహారపదార్థం అని చెప్పొచ్చు. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.