Task
చాలామంది పనులు వాయిదా వేస్తుంటారు అయితే వాళ్లను చూసి అబ్బా! నీకు చాలా బద్ధకం, రేపు చేద్దాంలే అని ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉంటావని తిడుతుంటారు వాళ్ల చుట్టుపక్కల వాళ్లు. కానీ సైకాలజీ పరిశోధనల ప్రకారం, వాయిదా వేయడం (Procrastination) అనేది బద్ధకం వల్ల రాదట. ఇది పూర్తిగా మనిషి మెదడులోని ‘ఎమోషనల్ రెగ్యులేషన్’ (భావోద్వేగాల నియంత్రణ) సమస్య అట. అంటే, ఆ పనిని చేయలేక కాదు, ఆ పని(Task) వల్ల మనిషికి కలిగించే ఒత్తిడిని తట్టుకోలేక వాయిదా వేస్తుంటారట.
ఏదైనా ఒక కష్టమైనా, కొత్త లేదా బోర్ కొట్టే పనిని చేయాలనుకున్నప్పుడు మనిషి మెదడులో భయం, ఆందోళన లేదా అసౌకర్యం మొదలవుతుందట. మెదడులోని అమిగ్డాలా (Amygdala)అనే భాగం ఆ పనిని ఒక ప్రమాదంలా భావిస్తుందట. ఈ అమిగ్డాలా అనేది మన మెదడులో ‘ఫైట్ లేదా ఫ్లైట్’ (పోరాడటం లేదా పారిపోవడం) వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది.
ఎప్పుడైతే ఒకరు ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ లేదా చదువును మొదలుపెట్టాలనుకుంటారో, అమిగ్డాలా వారిని ఆ ఒత్తిడి నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే వాళ్ల మెదడు మనల్ని తక్షణ సంతోషాన్నిచ్చే పనుల వైపు అంటే మొబైల్ ఫోన్ చూడటం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం లేదా నిద్రపోవడం వంటి వాటివైపు మళ్లించేస్తుంది.
అంటే ఆ క్షణానికి కలిగే నెగటివ్ ఎమోషన్ నుంచి వారిని వారు రక్షించుకోవడానికే పనులను వాయిదా వేస్తారు తప్ప, అది బద్ధకమో, చేతకాకో కాదు.
ప్రోక్రాస్టినేషన్‌ను జయించడానికి సైకాలజిస్టులు అద్భుతమైన 5-నిమిషాల రూల్ టెక్నిక్ చెబుతున్నారు. ఈ రూల్ ని ఎలా పాటించాలంటే:
ఏ పనినైతే వాయిదా వేయాలని అనుకుంటున్నారో, ఆ పనిని కేవలం 5 నిమిషాలు మాత్రమే చేస్తానని మనసుకి గట్టిగా చెప్పుకోవాలి.
కేవలం 5 నిమిషాలే కదా, ఆ తర్వాత ఆపేస్తానని మెదడుకు నమ్మకం కలిగితే, ఆ పని పట్ల అమిగ్డాలాకు ఉండే భయం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
ఒకసారి పని(Task) మొదలుపెట్టిన తర్వాత, మెదడుకు జైగార్నిక్ ఎఫెక్ట్ (Zeigarnik Effect) అనే గుణం ఉంటుంది. దీని వల్ల మెదడు ఏదైనా ఒక పనిని మధ్యలో వదిలేయడానికి ఇష్టపడదు. మొదలుపెట్టిన ఆ 5 నిమిషాల పనిని.. మొత్తం పూర్తి చేసే వరకు మనసు విశ్రమించనివ్వదు.
కాబట్టి ఇకపై ఎవరైనా మిమ్మల్ని వాయిదా వేస్తున్నారని తిడితే బాధపడొద్దు. అది మీ లోపం కాదని, మీ మెదడు మిమ్మల్ని రక్షించుకోవడానికి చూస్తోందని అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా ఆ భయాన్ని 5 నిమిషాల టెక్నిక్‌తో జయించండి. పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి మొదలుపెడితే విజయం మీదే..
