Lose Weight
బరువు తగ్గడమనేది(Lose Weight) ఒక నిరంతర ప్రక్రియ, కానీ చాలామంది అతి తక్కువ సమయంలో రిజల్ట్ రావడానికి భోజనం మానేస్తుంటారు. అయితే అలా ఆకలితో అలమటించడం వల్ల బరువు తగ్గకపోగా(Lose Weight), శరీరానికి ఎక్కువ నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
మనం ఆహారం మానేసినప్పుడు శరీరం స్టార్వేషన్ మోడ్లోకి వెళుతుంది. అంటే, శక్తి అందడం లేదని గ్రహించి, ఉన్న కొవ్వును ఖర్చు చేయకుండా దాచుకుంటుంది. దీనివల్ల జీవక్రియ (Metabolism) నెమ్మదించి, భవిష్యత్తులో మీరు కొంచెం తిన్నా అది త్వరగా కొవ్వుగా మారిపోతుంది.
అంతేకాకుండా,ఆహారం మానేయడం వల్ల కండరాల క్షీణత జరిగి శరీరం వీకవుతుంది. దీనివల్ల జుట్టు రాలడం, చర్మం ముడతలు పడటం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలంటే (Lose Weight) ముందుగా భోజనం మానేయడమనే ఆలోచనను పక్కన పెట్టాలి. దీనికి బదులుగా ‘పోర్షన్ కంట్రోల్’ అంటే తినే పరిమాణాన్ని తగ్గించడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు, రోజుకు మూడు సార్లు భారీగా తినే బదులు, ఐదు లేదా ఆరు సార్లు తక్కువ మొత్తంలో పోషకాహారం తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఆహారంలో పిండి పదార్థాలను(Carbohydrates) తగ్గించి, ప్రోటీన్లు, పీచు పదార్థాలు (Fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపించడంతో ఎక్కువసేపు ఆకలి వేయదు.
మనం తినే ఆహారంలో తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లు, పప్పు ధాన్యాలను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాలను బలోపేతం చేసి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. రోజుకు కనీసం మూడు , నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.
చాలామంది దాహాన్ని ఆకలిగా పొరబడుతుంటారు. అలాంటపుడు ముందుగా ఒక గ్లాసు నీరు తాగి చూడటం మంచిది. అలాగే చక్కెర, నూనెతో వేయించిన పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఇవి శరీరంలో అనవసరమైన క్యాలరీలను పెంచి బరువు తగ్గకుండా అడ్డుకుంటాయి.
ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యం. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది.
నిద్ర కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర లేకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి బరువు పెరగడానికి కారణమవుతాయి.
కాబట్టి, సన్నబడటం అంటే ఆకలితో ఉండటం కాదు. దీనికోసం సరైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవడమే అసలైన రహస్యం అని తెలుసుకోవాలి. మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఇంధనం లాంటిది. దాన్ని ఆపేయకుండా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ క్రమ పద్ధతిలో వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా, అందంగా సన్నబడొచ్చు.
BRICS : భారత్‌లో బ్రిక్స్ సమ్మిట్..డాలర్‌కు చెక్ పెట్టే ప్లాన్
