Sarva Darshan
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ నెల 25వ తేదీన తిరుమలలో అత్యంత వైభవంగా జరగనున్న ‘రథసప్తమి’ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సర్వదర్శనం(Sarva Darshan) టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం తిరుపతి నగరంలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ , గోవిందరాజస్వామి సత్రాల వద్ద మరుసటి రోజు దర్శనాల కోసం ఇచ్చే ఎస్ఎస్డీ (SSD) టోకెన్లను ఈ నెల 23, 24 , 25 తేదీలలో జారీ చేయరు.
రథసప్తమి రోజున ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తారు కాబట్టి, ఆ రోజున భారీగా తరలివచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 23వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లను ఈరోజు (గురువారం) జారీ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ 26వ తేదీన టోకెన్ల జారీ యథావిధిగా ప్రారంభమవుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని టోకెన్ జారీ కేంద్రాల వద్ద ఇప్పటికే ఈ ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
రథసప్తమి రోజున తిరుమలలో సర్వదర్శనం(Sarva Darshan) లైన్లలో వేచి ఉండే భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం లభిస్తుంది. కాబట్టి టోకెన్లు లేని వారు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్లొచ్చు. ఈ మూడు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ప్రయాణ ప్రణాళికను దీనికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది.
