Brown Rice
దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ (Brown Rice)మీ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మీ జుట్టు, చర్మానికి కూడా ఒక అద్భుతమైన వరమన్న సంగతి చాలామందికి అస్సలు తెలీదు. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా ఉంచడానికి, అలాగే జుట్టుకు పోషణ అందించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మచ్చలేని చర్మం కోసం బ్రౌన్ రైస్(Brown Rice)ని ఉపయోగించడానికి, అర కప్పు బ్రౌన్ రైస్‌ను ఒక కప్పు నీటిలో సుమారు 15 నిమిషాలు నానబెట్టాలి. ఈ నీరు పోషకాలను గ్రహించిన తర్వాత, బియ్యాన్ని వడగట్టి, ఆ నీటిని తీసుకోవాలి. ఒక కాటన్ బాల్‌తో ఈ ద్రవాన్ని మీ ముఖంపైన, మెడపైన అప్లై చేయాలి. కొన్ని నిమిషాలు మృదువుగా మసాజ్ చేసిన తర్వాత, అది పూర్తిగా ఆరిపోయే వరకు సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే, మీ చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
మెరిసే చర్మం కోసం మరొక చిట్కా ఉంది. బ్రౌన్ రైస్(Brown Rice)లోని సెలీనియం చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచడానికి ఇంకా మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని కోసం, ముందుగా బ్రౌన్ రైస్‌ను మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిలో అర టీస్పూన్ తీసుకుని, ఒక చెంచా సాదా పెరుగుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ఫేస్ మాస్క్‌లాగా అప్లై చేసి, పది నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మెరిసే చర్మాన్ని పొందొచ్చు.
మొటిమలతో బాధపడుతున్న వారికి కూడా బ్రౌన్ రైస్ మంచి పరిష్కారం చూపుతుంది. దీనికోసం రెండు చెంచాల బ్రౌన్ రైస్ నీటిని ఉపయోగించవచ్చు. మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, ఒక కాటన్ బాల్‌ను బ్రౌన్ రైస్ నానబెట్టిన నీటిలో ముంచి, మొటిమలు ఉన్న ప్రదేశంలో మాత్రమే అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు సమస్యలకు కూడా బ్రౌన్ రైస్ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దెబ్బతిన్న జుట్టును నయం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మూడు నుంచి నాలుగు చెంచాల బ్రౌన్ రైస్ పౌడర్, ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక కప్పు నీటిని కలిపి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేస్తే, అది జుట్టును శుభ్రం చేయడానికి దుమ్ము, ధూళిని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు పోషణ అందించి, దాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.