Emotions
ఈ మధ్యకాలంలో ఒక మాట ఎక్కువగా వినిపిస్తోంది. “AI మన భావోద్వేగా(Emotions)లను కూడా అర్థం చేసుకుంటుందట.” వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మనసు అంటే మనిషికే పూర్తిగా అర్థం కానిది. అలాంటిది ఒక మెషిన్ ఎలా అర్థం చేసుకుంటుంది? కానీ నిజం ఏమిటంటే, AI ఇప్పుడు మన భావోద్వేగాల దగ్గరికి చాలా దగ్గరగా వస్తోంది.
AI మనలాగే ఫీలవదు, కానీ మన ఫీలింగ్స్‌ను గుర్తించే స్థాయికి మాత్రం చేరుకుంది. మన మాటల టోన్, మనం టైప్ చేసే పదాలు, మన ముఖంలో వచ్చే ఎక్స్‌ప్రెషన్స్, మన వాయిస్‌లోని అప్ అండ్ డౌన్స్.. ఇవన్నీ AI చదవగలుగుతోంది. ఉదాహరణకి, ఒకరు కోపంగా మాట్లాడుతున్నారా? బాధలో ఉన్నారా? టెన్షన్‌లో ఉన్నారా? అన్నది ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ గుర్తించగలుగుతున్నాయి.
ఇది ఎలా సాధ్యమైంది అంటే, మన రోజువారీ డేటా వల్ల. మన సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు, వాయిస్ మెసేజ్‌లు, వీడియోల.. ఇవన్నీ మన భావోద్వేగా(Emotions)లకు అద్దం. AI ఈ డేటాను గమనిస్తూ, మనం ఏ సందర్భంలో ఎలా స్పందిస్తామో నేర్చుకుంటోంది. దీనినే ఎమోషనల్ AI (Emotional AI) అంటున్నారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇది మనకు సహాయం చేస్తుందా? లేక ప్రమాదమా? మంచి వైపు చూస్తే, AI మన మూడ్‌ను గుర్తించి సరైన సలహాలు ఇవ్వగలదు.
మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్లకు సపోర్ట్ అందించగలదు. పిల్లల ప్రవర్తనలో మార్పులు ముందే గుర్తించగలదు. డిప్రెషన్ లాంటి సమస్యలను తొందరగా గుర్తించే అవకాశం కూడా ఉంది.
కానీ నెగటివ్ వైపు ఇంకా బలంగా ఉంది. AI మన భావోద్వేగా(Emotions)లను అర్థం చేసుకుంటే, మన బలహీనతల్ని కూడా అర్థం చేసుకుంటుంది. మనకు ఏ టైప్ కంటెంట్ నచ్చుతుందో, ఎప్పుడు మనం ఎమోషనల్‌గా వీక్‌గా ఉంటామో, ఏ మాట మనల్ని త్వరగా ప్రభావితం చేస్తుందో.. ఇవన్నీ AIకి తెలిసిపోతాయి.
అప్పుడు మనం చూసే యాడ్స్ కూడా మన ఫీలింగ్స్‌ను టార్గెట్ చేస్తాయి. మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఖరీదైన వస్తువులు చూపించడం, భయంతో ఉన్నప్పుడు తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వడం.. ఇవి అన్నీ సాధ్యమే.
ఇంకో ప్రమాదం ఏంటంటే, మనిషి మనిషితో మాట్లాడకుండా, మెషిన్‌తోనే భావాలు పంచుకునే స్థితి రావచ్చు. ఇప్పటికే చాలామంది చాట్‌బాట్స్‌తో ఎక్కువగా మాట్లాడుతున్నారు. అది ఒక హద్దు దాటితే, నిజమైన సంబంధాల విలువ తగ్గిపోతుంది. సైకాలజీ ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. మన భావోద్వేగాలు మనకే పూర్తిగా అర్థం కాకపోతే, వాటిని పూర్తిగా మెషిన్‌కి అప్పగించడం ప్రమాదం.
AI ఒక టూల్ మాత్రమే. మన భావాలను హ్యాండిల్ చేసే హక్కు మన చేతిలోనే ఉండాలి. రాబోయే రోజుల్లో AI మరింత తెలివిగా మారుతుంది. మన మూడ్‌ను ముందే అంచనా వేసే స్థాయికి వస్తుంది. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. మన మనసు డేటా కాదు. మన భావాలు అల్గారిథమ్ కాదు. AI సహాయం తీసుకోవచ్చు. కానీ మన భావోద్వేగాల నియంత్రణ మన చేతిలో ఉండాలి. అది తప్పితే, మనల్ని అర్థం చేసుకున్నట్టు కనిపించే టెక్నాలజీ నెమ్మదిగా మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడుతుంది.
