Jaggery
మీరు కూడా హెల్త్ కాన్షియస్‌గా ఉండి, రోజూ బెల్లం తింటున్నారా? షుగర్‌కి బదులు బెల్లం వాడితే మంచిదని నమ్ముతున్నారా? అయితే ఇది మీకు నిజంగా షాకింగ్ న్యూస్. బెల్లం మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అందులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలతో ఇది మన బాడీకి మంచి బూస్టర్‌లా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్న బెల్లంలో ఎక్కువ భాగం నకిలీదేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కల్తీ బెల్లం తింటే ఆరోగ్యానికి మేలు జరగకపోగా, అనారోగ్యం పాలవడం ఖాయమని చెప్తున్నారు.
నిజమైన బెల్లం తయారీ చాలా సహజమైన ప్రక్రియ. చెరుకు రసం నుంచి దాన్ని సహజసిద్ధంగా కాచి తయారు చేస్తారు. అందుకే దాని రంగు కొంచెం ముదురుగా, కాఫీ కలర్‌లో ఉంటుంది. కానీ, మనం ఇప్పుడు మార్కెట్‌లో చూస్తున్న మెరిసే పసుపు పచ్చ రంగు బెల్లం తయారీ వెనుక ఒక దారుణమైన కథ ఉంది. కొందరు కేటుగాళ్లు తక్కువ నాణ్యత గల పంచదార పాకాన్ని తీసుకుని, అందులో రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపి ఈ నకిలీ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. ఈ బెల్లం చూడటానికి బంగారంలా మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ ఇది పూర్తిగా రసాయనాలతో నిండి ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్లు వంటి సీజన్‌లలో ఈ నకిలీ బెల్లం టన్నుల కొద్దీ మార్కెట్‌లోకి వస్తోంది.
కొంతమంది వ్యాపారులు మరింత అక్రమాలకు పాల్పడుతూ, బెల్లం బరువు ఎక్కువగా కనిపించడానికి కాల్షియం కార్బొనేట్, పసుపు రంగు రావడానికి సోడియం బైకార్బొనేట్ వంటి హానికర రసాయనాలను కలుపుతున్నారు. ఈ రసాయన బెల్లాన్ని కొందరు మంచి ధర పలికేందుకు “ఆర్గానిక్ బెల్లం” అంటూ కూడా అమ్ముతున్నారు. కానీ తెలియకుండానే మనం ఈ విషపూరిత కెమికల్స్‌ని మన శరీరంలోకి పంపిస్తున్నాం.
బెల్లం (Jaggery)మన శరీరంలోని మలినాలను బయటకు పంపి, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. కానీ ఈ రసాయనాలతో తయారైన కల్తీ బెల్లం దీనికి పూర్తిగా విరుద్ధంగా పనిచేస్తుంది. దీన్ని నిత్యం వాడటం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది, కాలేయంపై భారం పడుతుంది. అంతేకాకుండా, ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Jaggeryఈ కల్తీ బెల్లం ట్రాప్‌లో పడకుండా ఉండాలంటే మీరు కొన్ని సాధారణ చిట్కాలు పాటించాలి.
ఒక చిన్న బెల్లం ముక్కను గ్లాసు నీళ్లలో వేసి చూడండి. నిజమైన బెల్లం అయితే నీటిలో త్వరగా కరిగిపోతుంది. అదే నకిలీ బెల్లం అయితే, అది కరిగిన తర్వాత నీటి అడుగున తెల్లటి లేదా రంగు రంగుల అవశేషాలు ఎక్కువగా మిగిలిపోతాయి.
పసుపు పచ్చగా మెరిసే బెల్లం కంటే, ముదురు రంగులో ఉండే బెల్లం ఎంచుకోవడం మంచిది. అలాగే, ఒరిజినల్ బెల్లం తియ్యగా ఉప్పు రుచి కలగలిపి ఉంటుంది. రసాయనాలు కలిపిన బెల్లం తీపి ఎక్కువగా ఉంటుంది.వీలైతే, తెలిసిన వాళ్ల దగ్గర లేదా నమ్మకమైన షాపుల్లోనే బెల్లం కొనడం మంచిది.
ఆరోగ్యానికి మంచిదని ఏదైనా తినేటప్పుడు, అది నిజంగా మంచిదేనా అని ఒకటికి రెండు సార్లు చూసుకోవడం ఇప్పుడు చాలా అవసరం.
Also read: Graduates: డబ్బులిచ్చి ఆఫీసులకు వెళ్తున్న అక్కడి గ్రాడ్యుయేట్లు..