failure:అపజయం అనేది విజయానికి సోపానం అన్న మాట మనం తరచుగా వింటూ ఉంటాం. కొందరు చరిత్ర పురుషులు తమ జీవితంలో ఎదుర్కొన్న అపజయాలను, అవమానాలను నిజంగానే విజయానికి మెట్లుగా మార్చుకుని ఇలాంటి మాటలను నిజం చేశారు. సొసైటీ వారిని ఫెయిల్యూర్స్ అని ముద్ర వేసినా, వారి పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందు ఆ తీర్పులన్నీ ఓడిపోయాయి. వారి జీవిత కథలు, నిజమైన విజేతలు ఎలా పుడతారో.. ఇతరుల అభిప్రాయాలు వారి విజయాన్ని ఎలా ఆపలేవో క్రిస్టల్ క్లియర్‌గా చూపించాయి.
Don’t stop because of failure
మన చుట్టూ తిరస్కరణల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణల వరకు ప్రేరణాత్మక జీవిత పాఠాలు చాలా ఉన్నాయి. ప్రపంచాన్ని మార్చిన ఈ మహా మేధావులు ఎదుర్కొన్న ప్రారంభ వైఫల్యాలతో పాటు వాటిని అధిగమించి వారు సాధించిన అద్భుత విజయాలను మరింత వివరంగా చూద్దాం:
థామస్ ఎడిసన్ (Thomas Edison): ఆవిష్కరణల చక్రవర్తి..
థామస్ ఎడిసన్‌ను కేవలం నాలుగు నెలల స్కూల్ తర్వాత బడి నుంచి తొలగించారు. అతని టీచర్ ఏకంగా “మానసికంగా బలహీనుడు, ఏమీ నేర్చుకోలేడు” అని చెప్పేశాడు. కానీ అదే ఎడిసన్, వేల సార్లు విఫలమైనా పట్టు వదలకుండా విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ వంటి అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు చేసి మానవ చరిత్రనే మార్చేశాడు. అతని జీవితం పట్టుదలకు నిదర్శనం.
చార్లెస్ డార్విన్ (Charles Darwin): పరిణామ సిద్ధాంత పితామహుడు..
వైద్య విద్యను అభ్యసిస్తున్న డార్విన్‌కు అందులో ఆసక్తి ఉండేది కాదు. “నీ పిచ్చి ఆలోచనలు తప్ప నీకు ఇంకేమీ పట్టవు!” అంటూ అతని తండ్రి తీవ్రంగా విమర్శించి, వైద్య వృత్తిని వదిలేయమని ఒత్తిడి చేశారు. కానీ డార్విన్ ప్రకృతిపై తనకున్న అభిరుచిని వదులుకోలేదు. చివరికి, తన పరిణామ సిద్ధాంతంతో జీవశాస్త్ర ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేశాడు.
వాల్ట్ డిస్నీ (Walt Disney): అద్భుతాల సృష్టికర్త..
“నీకు సృజనాత్మకత లేదు, ఊహాశక్తి అసలు లేదు” అనే కారణంతో ఒక వార్తాపత్రిక ఉద్యోగం నుంచి వాల్ట్ డిస్నీని తొలగించారు. ఆ తర్వాత అతను అప్పులు చేసి, ఎన్నో కష్టాలు పడినా వెనకడుగు వేయలేదు. మిక్కీ మౌస్ వంటి పాత్రలను సృష్టించి, డిస్నీల్యాండ్‌ను నిర్మించి, తరతరాల ప్రజలు ఆరాధించే ఒక భారీ వినోద సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
బీథోవెన్ (Ludwig van Beethoven): సంగీత ప్రపంచ దిగ్గజం..
సంగీత మాంత్రికుడిగా పేరు పొందిన బీథోవెన్‌ను, అతని సంగీత గురువు “పూర్తిగా టాలెంట్ లేనివాడు, సంగీతం నీకు అస్సలు రాదు” అని కామెంట్ చేసేవారు. అంతేకాకుండా, అతని 20వ ఏట వినికిడి శక్తిని కోల్పోయారు.. అయినా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ప్రపంచంలోనే అత్యంత శాశ్వతమైన, భావోద్వేగమైన సింఫొనీలను కంపోజ్ చేసి సంగీత చరిత్రలో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein): ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు..
నాలుగేళ్ల వయసు వచ్చేవరకు ఐన్‌స్టీన్ మాట్లాడలేదు, అతని టీచర్ “మానసిక వికలాంగుడు” అని ముద్ర వేశారు. పాఠశాలలో ఒక మామూలు విద్యార్థిగా పేరు పొందిన ఐన్‌స్టీన్, తరువాత కాలంలో సాపేక్ష సిద్ధాంతంతో భౌతిక శాస్త్రాన్ని విప్లవాత్మకంగా మార్చి, చరిత్రలో గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరిగా నిలిచారు.
ఆగస్టే రోడిన్ (Auguste Rodin):ప్రపంచ ప్రఖ్యాత శిల్పి ..
ప్రపంచ ప్రఖ్యాత శిల్పి ఆగస్టే రోడిన్, పారిస్ ప్రతిష్టాత్మక ఆర్ట్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఏకంగా మూడు సార్లు విఫలమయ్యారు. దీనితో అతని తండ్రి “వెర్రివాడు, పనికిరానివాడు” అని అందరికీ చెప్పేవాడు. కానీ రోడిన్ తన అభిరుచిని వదులుకోలేదు. “ది థింకర్” వంటి కళాఖండాలను సృష్టించి, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ శిల్పులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు.
వూల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మోజార్ట్ (Wolfgang Amadeus Mozart): సంగీత సృష్టికర్త..
ఎనిమిదేళ్ల వయసు నుంచే అద్భుత సంగీత ప్రతిభను కనబరిచిన మోజార్ట్, ‘ది మ్యారేజ్ ఆఫ్ ఫిగరో’ ఒపేరాను కంపోజ్ చేశారు. అప్పటి చక్రవర్తి ఫెర్డినాండ్ ఈ ఒపేరాను విమర్శిస్తూ “చాలా నోట్స్ ఉన్నాయి” అని తేలికగా తీసేశారు. కానీ ఈ రోజు మోజార్ట్ మేధావి అనడంలో ఎలాంటి సందేహం లేదు, అతని సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడుతోంది.
డిమిత్రి మెండలీవ్ (Dmitri Mendeleev): రసాయన శాస్త్ర మార్గదర్శకుడు..
రసాయన శాస్త్రంలో సగటు మార్కులతోనే గ్రాడ్యుయేట్ అయిన మెండలీవ్, తన అద్భుతమైన అంతర్దృష్టితో పీరియాడిక్ టేబుల్ను రూపొందించారు. రసాయన మూలకాలను వర్గీకరించి, వాటి లక్షణాలను అంచనా వేయడం ద్వారా రసాయన శాస్త్రాన్ని పూర్తిగా మార్చివేశారు. అతని కృషి లేకుండా ఆధునిక రసాయన శాస్త్రం అసంపూర్ణం.
హెన్రీ ఫోర్డ్ (Henry Ford): ఆటోమొబైల్ విప్లవ పితామహుడు..
ఫోర్డ్ మోటార్ కంపెనీ సృష్టికర్త హెన్రీ ఫోర్డ్, ప్రాథమిక అక్షరాస్యతతో ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా, తన వ్యాపార జీవితంలో అనేక సార్లు దివాళా తీశారు. అయినా పట్టుదల వదలకుండా, అసెంబ్లీ లైన్ పద్ధతిని ప్రవేశపెట్టి, కార్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి, ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించారు.
గుగ్లిఎల్మో మార్కోని (Guglielmo Marconi): రేడియో ఆవిష్కర్త..
రేడియోను కనుగొని, గాలి ద్వారా మాటలను ప్రసారం చేయవచ్చని మార్కోని చెప్పినప్పుడు, అతని స్నేహితులు అతన్ని “పిచ్చివాడని” భావించి ఒక సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. కానీ కేవలం కొన్ని నెలల తర్వాత, అతని ఆవిష్కరణ సముద్రంలో సంభవించిన అనేక ప్రమాదాల నుంచి లక్షల ప్రాణాలను రక్షించింది. మార్కోని రేడియో కమ్యూనికేషన్‌లో ఒక కొత్త శకానికి నాంది పలికాడు.
జీవిత పాఠం..
అందుకే మీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి..వీరందరి ఫెయిల్యూర్స్ కూడా మనకి ఓ లెసన్‌గా మార్చుకుంటే రేపు ఈ విశ్వవిజేతగా నీ పేరు చరిత్రలో నిలిచిపోవచ్చు. గొప్ప విజయాలు చాలాసార్లు అపజయాల అంచు నుంచే మొదలవుతాయి. మీకు మీపై నమ్మకం ఉంటే, ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా రీచ్ అయి ఎంతో మందికి రోల్ మోడల్ అవుతారు. నిరాశ చెందకుండా, మీ డ్రీమ్స్‌ను నిజం చేసుకోవడానికి నిరంతరం కష్టపడండి.మీ గోల్‌ను రీచ్ అవండి.