Slow Living :జీవితాన్ని పరుగులెత్తించకండి..స్లో లివింగ్‌తో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి..

Slow Living: వేగంగా తినడం, వేగంగా ప్రయాణించడం, వేగంగా పనులు ముగించడం చేస్తూ..ఇలా ప్రతిదీ ఒక యాంత్రికంగా మార్చేసుకున్నాం.

Slow Living

ఈ కాలంలో మనమందరం ఒక తెలియని పరుగు పందెంలో పరిగెడుతూనే ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పనినీ పూర్తి చేయడానికి తపిస్తుంటాం. దీని కోసం వేగంగా తినడం, వేగంగా ప్రయాణించడం, వేగంగా పనులు ముగించడం చేస్తూ..ఇలా ప్రతిదీ ఒక యాంత్రికంగా మార్చేసుకున్నాం.

ఇంకా చెప్పాలంటే మనం జీవిస్తున్నామే తప్ప, ఆ జీవితంలో ఉండే మాధుర్యాన్ని మాత్రం ఒక్క క్షణం కూడా చవిచూడలేకపోతున్నాం. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్లో లివింగ్ అనే సరికొత్త లైఫ్ స్టైల్ ప్రాచుర్యంలోకి వస్తోంది. స్లో లివింగ్ (Slow Living)అంటే పనులు నెమ్మదిగా చేయడమని కాదు, చేసే ప్రతి పనిని పూర్తి స్పృహతో, మనసు పెట్టి ఆస్వాదిస్తూ చేయడమని అర్థం.

ఇంకొంచెం వివరించి చెప్పాలంటే స్లో లివింగ్(Slow Living) అనేది ఒక మానసిక స్థితి అని చెప్పొచ్చు. మనం రోజువారీ చేసే పనులలో నాణ్యతను పెంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఉదాహరణకు, ఉదయాన్నే కాఫీ, టీ తాగేటప్పుడు , చాలామంది ఫోన్ , టీవీ చూస్తూ ఉండటం పేపర్ చదవడం చేస్తూ ఉంటారు. అయితే ఆ ఒక్క 5-10 నిమిషాలు ఆ కాఫీ రుచిని, దాని వాసనను అనుభవిస్తూ తాగడం ఒక రకమైన స్లో లివింగ్ అన్నమాట.

అలాగే వంట చేసేటప్పుడు హడావుడిగా చేయడం, చిరాకు పడుతూ చేయడం కాకుండా, ఆ కూరగాయల రంగులను, సువాసనలను గమనిస్తూ ప్రేమతో వండటం. ఇలాంటి చిన్న చిన్న మార్పులే మెదడుపై ఉన్న ఒత్తిడిని ఒక్కసారిగా తగ్గించేస్తాయట.

మనలో చాలామంది ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, గతంలో జరిగిన వాటిని తలచుకుంటూ బాధపడుతుంటారు. కానీ స్లో లివింగ్ మనల్ని వర్తమానంలో బ్రతకడమనేది నేర్పిస్తుంది. ప్రస్తుతం మన చేతుల్లో ఉన్న సమయం ఎంత విలువైనదో ఇది గుర్తు చేస్తూ ఉంటుంది.

ఈ లైఫ్ స్టైల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయట. మనం ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజవుతుంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది. కానీ స్లో లివింగ్ పాటించడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Slow Living

దీనివల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యలు వంటివి దూరమవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనలోని క్రియేటీవిటీ పెరుగుతుంది. మెదడుకు కాస్త విరామం దొరికినప్పుడు మాత్రమే కొత్త ఆలోచనలు పుడతాయి. ఇప్పటి వరకూ పరుగు పందెంలో అలసిపోయిన మనసుకి ఈ విధానం ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

స్లో లివింగ్‌ను మన జీవితంలో భాగం చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా మీ రోజువారీ పనుల జాబితాను (To-do list) తగ్గించుకోవాలి. అన్ని పనులూ ఒకే రోజు అయిపోవాలని నిబంధన పెట్టుకోవద్దు. ప్రతిరోజూ కనీసం పది నిమిషాల పాటు ఏ పని చేయకుండా మౌనంగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.

ప్రకృతితో సమయాన్ని గడపాలి. ఇంట్లో పెంచుకునే మొక్కలకు నీళ్లు పోయడం , సాయంత్రం వేళ కాసేపు ఆకాశాన్ని చూడటం వంటివి చేయండి. మీ ఆత్మీయులతో,కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఫోన్‌ను పక్కన పెట్టి, వారి కళ్లలోకి చూస్తూ మనసు విప్పి మాట్లాడండి. జీవితం అంటే గమ్యాన్ని చేరుకోవడమే కాదు, ఆ ప్రయాణంలో ప్రతి అడుగును ఆస్వాదించడమే జీవితం..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version