Perfectionist
ఇప్పుడు యూత్ ఒకవైపు పోటీ ప్రపంచంలో నెట్టుకొస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో కనిపించే కృత్రిమ జీవితాలను చూసి ఒత్తిడికి గురవుతోంది. తల్లిదండ్రుల అంచనాలు, సమాజం విధించే ప్రమాణాలు.. ఇవన్నీ కలిసి వారిలో ‘పర్ఫెక్షనిజం’ అనే మానసిక బంధనాన్ని పెంచుతున్నాయి. పర్ఫెక్షనిజం అంటే, ప్రతి చిన్న పనిలో కూడా ఎంతో పరిపూర్ణత కోరుకోవడం, చిన్న పొరపాటు జరిగినా అది ఒక పెద్ద వైఫల్యంగా భావించడం. బయటకు చూసేవారికి ఇది ఒక మంచి లక్షణంలా కనిపించినా కూడా..ఇది లోపల మనిషిని నిశ్శబ్దంగా కుంగదీస్తుంది.
మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, పర్ఫెక్షనిజం ప్రధానంగా ‘నేను తప్పు చేస్తే, నా విలువ తగ్గిపోతుంది’ అనే భయం నుంచి పుడుతుంది. ఇలాంటి ఆలోచనలు క్రమంగా వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఎప్పుడూ ఒక భయం, ఆందోళనలో ఉండటం వల్ల, చివరికి ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ, నిద్రలేమి వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ పర్ఫెక్షన్ (Perfectionist)కల్చర్‌ను మరింత పెంచుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని విజయాలు, సంతోషకరమైన క్షణాలను మాత్రమే పంచుకుంటారు. కష్టాలు, వైఫల్యాలు బయటకు కనిపించవు. ఫలితంగా, యువత ఇతరులను చూసి, ‘వారు ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నారు, నేను మాత్రం ఎందుకూ పనికిరాను’ అనే తప్పుడు భావనను పెంచుకుంటున్నారు. ఈ ‘సామాజిక పోలిక’ (Social Comparison) వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పర్ఫెక్షనిజం వల్ల వచ్చే సమస్యలు..ఏదైనా పనిని పర్ఫెక్ట్‌గా చేయాలి అనే ఒత్తిడి వల్ల, చాలా పనులు మొదలుపెట్టకుండానే వాయిదా పడిపోతాయి.ఎప్పటికీ చేరుకోలేని ఒక పరిపూర్ణత కోసం ప్రయత్నించడం వల్ల, శారీరకంగా, మానసికంగా తీవ్రమైన అలసట కలుగుతుంది. పర్ఫెక్షనిస్టులు ఇతరుల నుంచి కూడా అసాధ్యమైన ప్రమాణాలను ఆశిస్తారు. దీనివల్ల వారి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. ఎప్పుడూ ‘తప్పు చేస్తానేమో’ అనే భయం ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు, దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీస్తుంది.
దీనిని అధిగమించే మార్గాలు..స్వీయ ప్రేమను నేర్చుకోండి.తప్పులు చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియ అని అంగీకరించండి. ప్రతి తప్పు ఒక పాఠం అని భావించండి. అసాధ్యమైన పరిపూర్ణత కోసం కాకుండా, మీరు చేరుకోగలిగే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. ఫలితం కంటే ప్రయత్నంపై దృష్టి పెట్టండి. ఒక పనిలో వచ్చే ఫలితం కన్నా, మీరు పెట్టిన కృషికి ప్రాధాన్యత ఇవ్వండి.
మైండ్‌ఫుల్‌నెస్ అండ్ థెరపీ ప్రాక్టీస్ చేయండి. అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ లాంటివి పాటించడం మంచిది. అవసరమైతే, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లాంటి చికిత్స పద్ధతులు కూడా సహాయపడతాయి.
పర్ఫెక్షనిజం(Perfectionist) అనేది ఒక మంచి గుణంలా కనిపించినా, అది ఒక మనిషిని బందీగా మార్చేస్తుంది. మన నిజమైన విలువను మన పని తీరుతో కాకుండా, మన మనసుతో, మనలోని వ్యక్తిత్వంతో అంచనా వేసుకోగలిగితేనే ఈ బంధనం నుంచి బయటపడగలం. ‘నేను పర్ఫెక్ట్ కాకపోయినా, నేను సరిపోతాను’ అనే భావనతో జీవించడం చాలా ముఖ్యం.