Loneliness
సాధారణంగా ఒంటరిగా ఉన్నామని చెప్పగానే చాలామంది బాధపడతారు. కానీ, నిజానికి ఒంటరిగా ఉండటం (Loneliness) ,ఏకాంతంగా ఉండటం (Solitude) అనే రెండు భావనలకు చాలా తేడా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవడం మన మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
ఒంటరితనం (Loneliness) అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. నిజానికి ఒంటరితనం అనేది బలవంతంగా ఒంటరిగా ఉన్నామనే భావన. మన చుట్టూ మనుషులు ఉన్నా కూడా, ఎవరితోనూ కనెక్ట్ అవ్వలేకపోతున్నామని, ఎవరూ మనల్ని అర్థం చేసుకోవడం లేదని కలిగే బాధాకరమైన భావన. ఇది మన మానసిక , శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఒంటరితనం ఉన్నవారు తరచుగా ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడికి గురవుతారు.
ఏకాంతం (Solitude) అంటే ఏంటంటే..ఏకాంతం అనేది మనం స్వచ్ఛందంగా, మనకు మనం సమయం కేటాయించుకోవడానికి తీసుకునే నిర్ణయం. ఇది ఒక ఆహ్లాదకరమైన, మనసుకు ప్రశాంతతను ఇచ్చే అనుభవం. ఏకాంతంగా ఉన్నప్పుడు మనం మన గురించి ఆలోచించుకోవచ్చు, మన ఆలోచనలను విశ్లేషించుకోవచ్చు, సృజనాత్మకతను పెంచుకోవచ్చు. దీనివల్ల మనసు రీఫ్రెష్ అవుతుంది. రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు వంటివారు తమ పనిలో ఎక్కువ ఏకాగ్రత చూపించడానికి ఏకాంతాన్ని కోరుకుంటారు.
ఒంటరితనం, ఏకాంతం మధ్య ముఖ్య తేడాలు..ఒంటరితనం – ఇతరులతో సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటారు, కానీ అలా చేయలేరు. ఇది బలవంతమైన ఒంటరితనం. ఏకాంతం స్వచ్ఛందంగా, మన ఇష్టంతో ఒంటరిగా ఉంటారు. ఇది మనసును బలోపేతం చేసే ప్రక్రియ.
ఏకాంతం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయంటారు మానసిక నిపుణులు. ముఖ్యంగా దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏకాంతం మన మనసును, ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది.
అలాగే ఆత్మ పరిశీలనకు అవకాశం ఉంటుంది. అంటే మనకు మనం సమయం ఇచ్చుకోవడం వల్ల మన బలాలు, బలహీనతలు, లక్ష్యాలను గురించి ఆలోచించుకోవచ్చు. అంతేకాదు సృజనాత్మకతకు ..ఒంటరిగా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు, పరిష్కారాలు త్వరగా స్ఫురిస్తాయి.అలాగే ఏకాంతంగా ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
మీరు ఒంటరిగా ఉండటం ఇష్టపడితే, అది ఒంటరితనమా లేదా ఏకాంతమా అని ఆలోచించుకోండి. ఒకవేళ ఒంటరితనం అయితే, స్నేహితులతో మాట్లాడటం, కొత్త హాబీలు నేర్చుకోవడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. ఒకవేళ ఏకాంతం అయితే, దానిని ఆస్వాదించండి. అది మీ మనసును, జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది.