Phone
జేబులో ఫోన్ లేదంటే గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. “ఫోన్ మర్చిపోయానా?” అని మళ్లీ మళ్లీ చెక్ చేస్తాం. ఇది అలవాటు కాదు నాన్న. ఇది ఒక మానసిక పరిస్థితి. దీనికే ఇప్పుడు సైకాలజీ ఒక పేరు పెట్టింది.. నోమోఫోబియా( Nomophobia). నోమోఫోబియా అంటే “No Mobile Phone Phobia”. అంటే ఫోన్ దగ్గర లేకపోవడంపై వచ్చే భయం.
ఈ భయం ఎలా మొదలైంది? ముందు ఫోన్(Phone) ఒక సాధనం. ఇప్పుడు ఫోన్ మన జీవితంలో భాగం. మన ఫోన్‌లో మన ఫోటోలు ఉన్నాయి. మన మాటలు ఉన్నాయి. మన స్నేహితులు, పని, డబ్బు, గుర్తింపే ఉంది. అంటే ఫోన్ పోయినట్టుగా అనిపించడం కాదు. మన ఒక భాగం పోయినట్టుగా అనిపిస్తుంది.
ఇక్కడే మెదడు అలారం మోగిస్తుంది. సైకాలజీ చెబుతుంది.. మన మెదడుకు భద్రత చాలా ముఖ్యం. ఫోన్ మనకు భద్రత ఇచ్చే వస్తువులా మారిపోయింది. ఎవరైనా మెసేజ్ చేస్తారా? ఎవరైనా కాల్ చేస్తారా? ఏదైనా అప్‌డేట్ మిస్ అవుతుందా? ఈ ఆలోచనలు మెదడులో తిరుగుతుంటే, ఫోన్ దూరమైతే టెన్షన్ రావడం సహజం.
ఇంకో పెద్ద కారణం ఉంది. మన ఫోన్ మనకు తక్షణ ఆనందం (Instant Gratification) ఇస్తుంది. నోటిఫికేషన్ వస్తే చిన్న హ్యాపీ ఫీలింగ్. రీల్స్ చూస్తే టైమ్ మర్చిపోతాం. ఇది మెదడులో డోపమిన్ (Dopamine) అనే కెమికల్ విడుదల చేస్తుంది. మళ్లీ మళ్లీ ఫోన్ చూడాలనిపించడం అంటే మెదడు ఆ ఆనందానికి అలవాటు పడిపోయింది అన్న మాట.
ఫోన్ లేకపోతే ఆ డోపమిన్ రావడం ఆగిపోతుంది. అప్పుడే మెదడు అసహనంగా మారుతుంది. అదే టెన్షన్… అదే చిరాకు… అదే అసౌకర్యం. కొంతమందికి అయితే ఫోన్ లేకపోతే చెమటలు పడతాయి, చేతులు వణుకుతాయి, ఏకాగ్రత తగ్గిపోతుంది. ఇది నిజంగా సీరియస్. ఇంకో ప్రమాదం ఏమిటంటే.. మన ఒంటరితనాన్ని ఫోన్ కప్పిపుచ్చుతుంది.
మనసులో ఖాళీగా అనిపిస్తే, ఎవరితో మాట్లాడాలో తెలియకపోతే, ఫోన్(Phone) తీసుకుని స్క్రోల్ చేస్తాం. కానీ సమస్య ఏమిటంటే.. అసలు ఒంటరితనం అలాగే ఉంటుంది. ఫోన్ పెట్టగానే మళ్లీ అదే ఫీలింగ్. అప్పుడే Nomophobia బలపడుతుంది. దీనినుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఫోన్‌ని పూర్తిగా వదిలేయమని కాదు. కానీ దానికి మనసును బానిస చేయకూడదు.
రోజులో కొంత టైమ్ ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. నోటిఫికేషన్స్ తగ్గించాలి. ఫోన్ లేకుండానే కూర్చునే శక్తి పెంచుకోవాలి. అన్ని వివరాలు ఫోన్లోనే సేవ్ చేయకుండా పాత కాలంలోగా డైరీలో రాయడం అలవాటు చేసుకోవాలి.
ముఖ్యంగా..మీ మనసుతో మీరు మాట్లాడటం నేర్చుకోవాలి. ఎప్పుడూ ఫోన్(Phone)తో కాదు. ఫోన్ మన అవసరం. కానీ మన మనశ్శాంతి కాదు. మన మనసు మన చేతిలో ఉంటేనే నిజమైన స్వేచ్ఛ. లేకపోతే చేతిలో ఉన్న చిన్న డివైస్ మనల్ని లోపల నుంచే కంట్రోల్ చేస్తుంది.
