Heart attack
ఈ రోజుల్లో గుండెపోటు (Heart attack)కేవలం పెద్దవారి సమస్యగా మిగల్లేదు. 30, 40 ఏళ్ల యువకుల్లో కూడా కార్డియాక్ అరెస్ట్‌లు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో విశాఖపట్నంలో రాత్రి పడుకున్న వ్యక్తి తెల్లవారకముందే చనిపోయిన ఘటన, అనకాపల్లిలో బస్సులో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించడం, బెంగళూరులో ఒక కార్డియాలజిస్ట్ హాస్పిటల్‌లో నడుస్తూనే కుప్పకూలడం.. ఇలాంటి సంఘటనలు మనల్ని కలవరపెడుతున్నాయి.
గుండెపోటు(Heart attack)కు ప్రధాన కారణం గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ , ఇతర పదార్థాలు పేరుకుపోవడం కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దానివల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ అందక అవి దెబ్బతింటాయి. అయితే, ఈ సమస్య యువతలో పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు.
మారుతున్న జీవనశైలితో ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వేళాపాళాలేని నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. అలాగే ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి మానసిక ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా తర్వాత ఈ ఒత్తిడి మరింత పెరిగింది.
పొగతాగడం, మద్యం సేవించడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమన్న విషయాన్ని యూత్ మర్చిపోతున్నారు.
వంశపారంపర్య ప్రభావం కూడా ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే, ఆ ప్రభావం పిల్లలపైనా ఉండే అవకాశం ఉంది.అంతేకాదు అధిక బరువు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటివి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.
గుండెపోటు(Heart attack)ను తొలి దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతీలో నొప్పి, ఎడమ చేయి నొప్పి, శ్వాసలోపం, మెడ, దవడ నొప్పి, బలహీనత వంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.
నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తక్కువ నూనెతో వండిన ఆహారం తీసుకోవాలి.
రోజువారీ వాకింగ్, యోగా, ధ్యానం వంటివి చేయాలి. పొగతాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి.మెడిటేషన్, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 6 నెలలకోసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం, రక్తపోటు, షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఛాతీలో ఏమాత్రం అసౌకర్యం అనిపించినా, ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
మనం తినే ఆహారం, మన జీవనశైలి, మానసిక స్థితి.. ఇవన్నీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. యువత ఇప్పుడు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే మొదటి మెట్టు.