Alcohol:లిక్కర్ తాగితే పోయేది లివర్ మాత్రమే కాదు..W.H.O చెప్పిన భయంకరమైన నిజాలేంటో చూడండి?

Alcohol:తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మద్యంని గ్రూప్ 1 కార్సినోజెన్ జాబితాలో చేర్చింది.

Alcohol

ఇప్పటి వరకూ లిక్కర్ ఎక్కువ తాగితే లివర్ చెడిపోతుందని అనడం వింటుంటాం. కానీ దీని వల్ల భయంకరమైన క్యాన్సర్లు కూడా వస్తాయట. అవును పొగాకు తాగినా, రేడియేషన్ కు గురైనా క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఆల్కహల్(Alcohol) కూడా అదే స్థాయిలో క్యాన్సర్ కారకం (Carcinogen) అని ఎవరికీ తెలియదు.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మద్యంని గ్రూప్ 1 కార్సినోజెన్ జాబితాలో చేర్చింది. అంటే పొగాకు ఎంత ప్రమాదకరమో, మద్యం కూడా అంతే ప్రమాదకరం అని చెప్పినట్లు అర్ధం. అమెరికాలో జరిగిన తాజా సర్వే ప్రకారం 66 శాతం మందికి ఈ విషయం తెలియదు. ఇక మన దేశంలో అయితే ఈ పరిస్థితి మరీ ఘోరం. ఐసీఎంఆర్ (ICMR) నివేదికల ప్రకారం, భారతదేశంలో 70 శాతం మందికి మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందనే అవగాహన అస్సలు లేదట.

ఆల్కహాల్(Alcohol )సేవించినప్పుడు..వారి శరీరం దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రక్రియలో ‘అసిటాల్డిహైడ్’ అనే అత్యంత విషపూరితమైన పదార్థం తయారవుతుందట. ఇది మన కణాలలోని డీఎన్ఏ (DNA) ను డైరక్టుగా దెబ్బతీస్తుంది. దెబ్బతిన్న డీఎన్ఏ వల్ల కణాలు అదుపు తప్పి పెరిగి గడ్డలుగా మారి క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఇది కేవలం లివర్‌కే పరిమితం కాదు.. నోరు, గొంతు, ఆహార నాళం, రొమ్ము, పేగు క్యాన్సర్లతో సహా 7 రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణం అవుతోందన్న వాస్తవమే ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

అయితే మద్యం ప్రభావం ..మగవారి కంటే మహిళలపై చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. మహిళల శరీర బరువు తక్కువగా ఉండటంతో పాటు వారిలో మద్యాన్ని అరిగించే ఎంజైములు తక్కువగా ఉండటం వల్ల రసాయనాలు బాడీలోనే ఎక్కువ సేపు ఉండిపోతాయి.

రోజుకు ఒక్క పెగ్ మందు తాగే మహిళల్లో క్యాన్సర్ ముప్పు 19 శాతం పెరిగితే, పురుషుల్లో అది 11 శాతంగా ఉందట. ముఖ్యంగా మద్యం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగి రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) వచ్చే అవకాశాలు 15 – 20 శాతం వరకు పెరుగుతున్నాయి.

Alcohol

ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నోటి క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో.. 62 శాతం మందికి మద్యం అలవాటే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్, ఎంఎన్‌జే వంటి ఆసుపత్రుల్లో నమోదవుతున్న వివిధ క్యాన్సర్ కేసుల్లో 40 శాతం మద్యం సంబంధితమైనవే ఉండటం గమనార్హం. మితంగా తాగితే ఆరోగ్యం అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని, క్యాన్సర్ విషయంలో సురక్షితమైన పరిమితి అంటూ ఏదీ కూడా లేదని నివేదికలు తేల్చి చెబుతున్నాయి.

అవగాహన లేకపోవడమే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారుతోంది. మద్యం బాటిళ్లపై కూడా సిగరెట్ ప్యాకెట్ల మాదిరిగా క్యాన్సర్ హెచ్చరికలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం అలవాటును పూర్తిగా మానుకోవడమే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అని చెబుతున్నారు.

Municipal Elections: క్లైమాక్స్‌కు వచ్చేసిన తెలంగాణ మున్సిపల్ పోరు.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరికి ప్లస్?

 

Exit mobile version