AC
ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అయితే, సీజన్‌తో సంబంధం లేకుండా ఏసీ వాడకం ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల నెల చివర్లో వచ్చే భారీ కరెంటు బిల్లులు చాలామందికి షాకిస్తుంటాయి. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే, ఏసీని హాయిగా వాడుతూనే కరెంటు బిల్లును గణనీయంగా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది రూమ్ త్వరగా చల్లబడాలని భావించి ఏసీని 18 నుంచి 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలో పెడుతుంటారు. కానీ ఇది కరెంట్ బిల్లు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. నిజానికి, మన శరీరానికి 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో ఏసీని వాడటం వల్ల కూలింగ్ పెరగడమే కాకుండా, కంప్రెసర్ పై ఒత్తిడి తగ్గుతుంది, దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
ఏసీ(AC)ని కొనుగోలు చేసేటప్పుడు గది విస్తీర్ణాన్ని బట్టి సరైన టన్ ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, ఏసీ అవుట్ డోర్ యూనిట్ మీద నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. ఎండ తగిలితే, ఆ యూనిట్ వేడెక్కి ఏసీ చల్లగాలిని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా అది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, దీనివల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది. అవుట్‌డోర్ యూనిట్‌పై ఎండ పడకుండా షేడ్స్ లేదా ఇతర ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
ఏడాదికి కనీసం ఒకసారైనా ఏసీని సర్వీస్ చేయించడం తప్పనిసరి. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లు మరియు డక్ట్స్‌లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దుమ్ము పేరుకుపోతే ఏసీ పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది, దీనివల్ల అది ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. శుభ్రంగా ఉన్న ఏసీ తక్కువ సమయంలో ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది.
ఏసీని 24 గంటలూ ఆన్‌లో ఉంచకూడదు. అవసరాన్ని బట్టి ఆన్, ఆఫ్ చేయడం మంచిది. ఏసీ నడుస్తున్నప్పుడు గదిలోని కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి ఉంచాలి, లేకపోతే చల్లగాలి బయటికి వెళ్లిపోయి ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. అంతేకాకుండా, గదిలో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్లు వంటి వేడిని విడుదల చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను వీలైనంత వరకు బయటే ఉంచడం మంచిది.
ఏసీ (AC)వాడేటప్పుడు ఫ్యాన్ కూడా కాసేపు ఆన్ చేయడం ఒక మంచి చిట్కా. ఫ్యాన్ వేస్తే గదిలో చల్లని గాలి అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది. దీనివల్ల మన శరీరానికి మరింత చల్లగా అనిపిస్తుంది, అప్పుడు మనం ఏసీ ఉష్ణోగ్రతను పెంచుతాం. దీనివల్ల కూడా కరెంట్ ఆదా అవుతుంది.