Post-Traumatic Growth:గాయం నుంచి గెలుపు దాకా ఎలా ఎదగాలి? అయితే పోస్ట్-ట్రామాటిక్ గ్రోత్ తెలుసుకోండి..

Post-Traumatic Growth: మన పాత నమ్మకాలు, పాత ఆలోచనా ధోరణి అన్నీ కూడా కష్టాల ధాటికి ముక్కలైనప్పుడు, ఆ శూన్యం నుంచే ఒక కొత్త దృక్పథం అనేది వారిలో చిగురిస్తుంది.

Post-Traumatic Growth

జీవితం ఎలాంటివారికైనా ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. ఒక్కోసారి ఊహించని దెబ్బ తగులుతుంది..అది ఆత్మీయుల మరణం కావొచ్చు, ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యాపారంలో నష్టం కావొచ్చు లేదంటే జీవితాంతం వెంటాడే అనారోగ్యం అయినా కావచ్చు. అలాంటి సమయంలో ఎలాంటి మనిషి అయినా అద్దంలా విరిగి ముక్కలైపోతాడు.

సాధారణంగా ఇలాంటి అనుకోని విషాదాల తర్వాత అందరూ పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ (PTSD) గురించి మాట్లాడుతుంటారు. కానీ సైకాలజీలో మాత్రం పోస్ట్-ట్రామాటిక్ గ్రోత్ ( Post-Traumatic Growth) అనే ఒక అద్భుతమైన స్థితి ఉందని..దాని గురించే మాట్లాడాలని చాలామంది తెలుసుకోలేరు. దీనర్ధం కేవలం పాత స్థితికి చేరుకోవడం కాదు, ఆ గాయం వల్ల మునుపటి కంటే బలమైన వ్యక్తిగా రూపాంతరం చెందడం అన్నమాట.

జపాన్ దేశంలో కైంట్‌సుగి (Kintsugi) అనే ఒక ఆర్ట్ ఉంది. దీనిలో ఏదైనా మట్టి పాత్ర పగిలితే, ఆ ముక్కలను ఏకంగా బంగారంతో అతికిస్తారు. అలా అతికించిన తర్వాత ఆ పాత్ర మునుపటి కంటే మరింత అందంగా, మరింత విలువైనదిగా మారుతుంది. మనిషి మనస్తత్వం కూడా అంతే. మన పాత నమ్మకాలు, పాత ఆలోచనా ధోరణి అన్నీ కూడా కష్టాల ధాటికి ముక్కలైనప్పుడు, ఆ శూన్యం నుంచే ఒక కొత్త దృక్పథం అనేది వారిలో చిగురిస్తుంది.

బాధను అనుభవిస్తున్నప్పుడు మనలోంచి అంతవరకూ లేని ఒక తెలియని శక్తి బయటకు వస్తుంది. ఏదైనా పెద్ద వ్యాధి నుంచో, యాక్సిడెంట్ నుంచో , ఒక విషాదం నుంచో బయటపడ్డాక..అప్పటి వరకూ చిన్న చిన్న విషయాలకు గొడవపడే మనం, జీవితం ఎంత విలువైందో గ్రహించి ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో చూడటం మొదలుపెడతాం.

మన చుట్టూ ఉన్న సంబంధాల్లో ఉన్న అసలైన లోతు కూడా అప్పుడే అర్థమవుతుంది. మన కష్టంలో ఎవరు తోడున్నారో, ఎవరు కేవలం మాటలకే పరిమితమయ్యారో ఒక క్లారిటీ వస్తుంది. దీనివల్ల పైపై సంబంధాల కంటే, గాఢమైన అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని గుర్తిస్తాం.

Post-Traumatic Growth

నన్ను చంపలేని ఏ కష్టమైనా సరే నన్ను మరింత బలవంతుడిని చేస్తుంది అన్న నీషే మాట.. ఇక్కడ అక్షరాలా చాలామంది జీవితంలో నిజం చేసుకుంటారు. ఈ ఎదుగుదల మన జీవితంలో కూడా రావాలంటే మనలోని బాధను అణచివేయకూడదు,ఆ బాధను ఫేస్ చేయాలి. ఆ గాయం కలిగించిన మచ్చలను గర్వంగా దాచుకోవాలి.

ఎందుకంటే ఆ మచ్చలే, ఆ బాధలే రేపు మనం సాధించబోయే విజయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎవరికి అయినా కష్టం ఒక ముగింపు కాదని.. అది ఒక కొత్త మనిషి పుట్టుకకు అవసరం అయిన ప్రసవ వేదన వంటిది అని పోస్ట్-ట్రామాటిక్ గ్రోత్(Post-Traumatic Growth) చెబుతుంది . ఎందుకంటే ఇది మనల్ని మనం రీ-బ్రాండింగ్ చేసుకోవడానికి వచ్చే ఒక కఠినమైన అవకాశం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version