Relationships:ప్రాణమిచ్చిన వారే మిమ్మల్ని దూరం పెడుతున్నారా? పాత బంధాల విలువ కోల్పోవడానికి కారణాలేంటి?

Relationships: మన జీవితంలోకి ఎవరైనా వచ్చినప్పుడు కొత్తలో మనం వారికి ప్రపంచమంతా మనమే అన్నట్టుగా ప్రవర్తిస్తారు.

Relationships

జీవిత ప్రయాణంలో మనకు ఎంతో మంది మనుషులు పరిచయం అవుతూనే ఉంటారు. మన జీవితంలోకి ఎవరైనా వచ్చినప్పుడు కొత్తలో మనం వారికి ప్రపంచమంతా మనమే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. మన మాటలకే ఎక్కువ విలువ ఇస్తారు, మనతో రోజూ గంటల తరబడి మాట్లాడతారు. తన లైఫ్‌లో జరిగే ప్రతీ అప్ డేట్ చెబుతూ మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు.

కానీ కొంతకాలం గడిచాక, వారి జీవితంలోకి కొత్త మనుషులు లేదా కొత్త అనుభవాలు రాగానే మనల్ని నెమ్మదిగా పక్కన పెట్టేస్తుంటారు. డైరక్టుగా నువ్వు నాకు వద్దని చెప్పరు కానీ, వారి ప్రవర్తనలో వచ్చే మార్పు మనకు అన్నీ చెప్పకనే చెబుతాయి. ఫోన్ కాల్స్ తగ్గడం, మెసేజ్‌లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, బిజీగా ఉన్నానని తరచూ చెప్పడం వంటివి మనల్ని మౌనంగా చంపేస్తుంటాయి.సాధారణంగా ఇది ఫ్రెండ్స్ , ఒక బంధం(Relationships)లోకి వెళ్లిన వారి మధ్య జరుగుతూ ఉంటుంది.

ఇలాంటి సమయంలో మన తప్పు ఏముందని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ బాధపడుతుంటాం. కానీ నిజానికి ఇది మన తప్పు కాదు, ఇది పూర్తిగా మనిషి మనస్తత్వానికి సంబంధించిన విషయం అంటున్నారు సైకాలజిస్టులు.

సైకాలజీ ప్రకారం కొంతమంది తమ జీవితంలోని ఒక నిర్దిష్ట దశలో మాత్రమే వేరే వాళ్లను దగ్గర చేసుకుంటారు. ఆ సమయంలో మనతో ఎంతో క్వాలిటీ టైమ్ గడుపుతారు. మనసుకి అతి దగ్గరగా ఉంటూ, మనమే సర్వస్వం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆ క్షణాల్లో వారు చూపించే ఆత్మీయతను చూసి ఈ బంధం జీవితాంతం ఇలాగే ఉంటుందని బలంగా నమ్ముతాం.

కానీ తీరా వారి జీవితం కొత్త మలుపు తిరిగినా లేదా కొత్త పరిచయాలు ఏర్పడినా.. అప్పటివరకు మనతో పంచుకున్న ఆ జ్ఞాపకాలను, ఆ క్వాలిటీ టైమ్ ను చాలా ఈజీగా మరిచిపోతారు. మనం ఆ బంధాన్ని ఒక పవిత్రమైన అనుబంధంగా చూస్తే, అవతలి వారు మాత్రం దానిని కేవలం తమ లైఫ్‌లో తారసపడిన ఒక అనుభవంలాగో లేదా ఒక చిన్న మజిలీ లాగా మాత్రమే చూస్తారు. ఈ ఆలోచనా దృక్పథంలో ఉన్న తేడానే చివరకు మనల్ని ఎక్కువగా బాధిస్తుంది.

అయితే మనిషి సైకాలజీ ప్రకారం.. కొత్త బంధాలు(Relationships) ఏర్పడినప్పుడు వారి మెదడులో విడుదలయ్యే డోపమిన్ అనే కెమికల్ వల్ల కలిగే ఆ ఎగ్జైట్మెంట్ లో..అంతవరకూ ఉన్న పాత బంధాలు రానురాను వారికి బోరింగ్‌గా అనిపిస్తుంటాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా, పాత స్నేహితులు .. ఆప్తులు బ్యాక్ సీట్ లోకి వెళ్లిపోవడం సహజంగానే జరిగిపోతూ ఉంటుంది.

ఇలాంటపుడు వాళ్లు అవతలి వారికి నేరుగా చెప్పకుండా ఎందుకు దూరం పెడతారంటే, ముఖాముఖి మాట్లాడి బంధాన్ని తెంచుకునే ధైర్యం చాలా మందికి ఉండదు. అలా చెబితే తమ ఇమేజ్ చెడిపోతుందనో లేదా ఎదుటి వారిని బాధ పెట్టడం ఎందుకనో భావించి తప్పించుకోవడమే మంచిదని అనుకుంటారు.

మనం క్లారిటీ కోసం ఎంత ప్రయత్నించినా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాదు. ఎందుకంటే వారి మనసు అప్పటికే మన నుంచి వేరు పడిపోయి ఉంటుందన్నది వారికి తెలుసు.అది డైరక్టుగా చెబితే ఎక్కడ మనం బాధపడతామో లేదా ఎక్కడ నానా రచ్చ చేస్తారో అన్న ఆలోచన వారిని మాట్లాడనివ్వదు. అందుకే చాలా తెలివిగా ..మెల్లమెల్లగా దూరాన్ని అలవాటు చేస్తారు.

Relationships

అయితే ఎవరైనా మనల్ని వదిలి వెళ్లారంటే అక్కడ మన విలువ తగ్గిందని ఎప్పుడూ అనుకోకూడదు. మన మంచితనం, కేరింగ్ తప్పు కాదు, అవి తప్పుడు వ్యక్తుల మీద ఖర్చు చేశామన్నదే గ్రహించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రతి మనిషి మన జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనకు జీవితంలో విలువైన పాఠాలు నేర్పడానికి మాత్రమే వస్తారు.

కొత్తవాళ్లు నచ్చారనో.. లేదా మనల్ని అవసరానికి వాడుకుని వదిలేసే వారి కోసం మన విలువను మనం తగ్గించుకోకూడదంటారు సైకాలజిస్టులు. నిజమైన బంధాలు ఎప్పుడూ మౌనంగా దూరం పెట్టవు, వాటికి క్లారిటీ ఉంటుందన్న విషయం తెలుసుకోవాలని చెబుతున్నారు. మన విలువ తెలిసిన చోటే మనం ఉండటం మన ఆత్మగౌరవానికి మంచిదని సలహా ఇస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Exit mobile version