Decision fatigue
ప్రతిరోజూ మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఉదయం నిద్ర లేవగానే ఏ టీషర్ట్ వేసుకోవాలి, టిఫిన్‌లో ఏం తినాలి… ఇలా చిన్న చిన్న విషయాలు మొదలుకొని, జీవితాన్ని మార్చే పెద్ద నిర్ణయాల వరకు మన మెదడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఒకరోజులో దాదాపు 35 వేల నిర్ణయాలు తీసుకునే ఈ (Decision Fatigue)ప్రక్రియ మెదడును అలసిపోయేలా చేస్తుంది. ఈ పరిస్థితినే డెసిషన్ ఫెటీగ్( Decision Fatigue) లేదా నిర్ణయ అలసట అంటారంటున్నారు మానసిక నిపుణులు.
ఒక రోజు ఉదయం, రమేష్ అలారం మోగగానే లేచాడు. అతని మొదటి నిర్ణయం ..కాఫీ తాగాలా లేక జ్యూస్ తాగాలా? అక్కడే మొదలైంది. ఆ తర్వాత ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ బూట్లు వేసుకుంటే బాగుంటుంది? అని ఆలోచిస్తూనే ఆఫీస్‌కి వెళ్లాడు. ఆఫీస్‌కి వెళ్లాక మీటింగ్‌లు, ఈమెయిళ్లు, కస్టమర్ కాల్స్… ప్రతిదానికీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. మధ్యాహ్నానికి అతని మెదడు పూర్తిగా అలసిపోయింది.
సాయంత్రానికి బాస్ అడిగిన ఒక కొత్త ప్రాజెక్టుపై పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ రమేష్ అప్పటికే నిర్ణయాలతో అలసిపోయి, సరే, రేపు చూద్దాం అని వాయిదా వేశాడు. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే ఒక సాధారణ పరిస్థితి. ఇది మన మెదడు శక్తి ఎలా పనిచేస్తుందో, రోజులో మనం తీసుకునే నిర్ణయాల నాణ్యత ఎలా మారుతుందో వివరిస్తుంది.
శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో, జడ్జిలు ఉదయం పూట ఖైదీలకు పెరోల్ ఇచ్చే అవకాశం 65% వరకు ఉండేది. కానీ రోజంతా నిర్ణయాలు తీసుకుని సాయంత్రానికి వచ్చేసరికి, వారి ఆలోచన శక్తి అలసిపోయి, ఆ అవకాశం 10% కి పడిపోయింది. దీనివల్ల నిందితులకు శిక్షలు పెరిగిపోయాయి.
ఈ డెసిషన్ ఫెటీగ్( Decision Fatigue) అనేది మన రోజువారీ జీవితంలో అనేక రకాలుగా కనిపిస్తుంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఏ డ్రెస్ బాగుంటుంది, ఏ కలర్ బెటర్ అని చాలాసేపు ఆలోచించి, చివరికి విసిగిపోయి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తాం. విద్యార్థులు ఉదయం పూట చదివితే విషయాలు బాగా అర్థమవుతాయి. కానీ రాత్రికల్లా వారి ఏకాగ్రత తగ్గిపోతుంది. అలాగే, డైట్‌లో ఉన్నవారు రోజువారీ నిర్ణయాలతో అలసిపోయి, రాత్రికి ఈ ఒక్కసారి తింటే ఏమవుతుంది? అని జంక్ ఫుడ్ తినేస్తారు.
ఈ సమస్యకు ఒక సరళమైన పరిష్కారం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు ఉదయం పూట తీసుకోవాలి. అలాగే మన దైనందిన జీవితంలోని Routine లను ఆటోమేట్ చేసుకోవాలి. స్టీవ్ జాబ్స్ వంటి దిగ్గజాలు రోజువారీ నిర్ణయాలను తగ్గించుకోవడానికి ఎందుకు ఒకే రకమైన దుస్తులు ధరించేవారో తెలుసా? ముఖ్యమైన పనుల కోసం మెదడు శక్తిని ఆదా చేసుకోవడానికే! ఈ అలసటను అర్థం చేసుకుంటే, అనవసరమైన ఆలోచనలకు బదులు, మన శక్తిని సరైన దారిలో ఉపయోగించుకోవచ్చు. ఇది మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా, విజయవంతంగా మారుస్తుంది.