Letting Go
జీవితం అంటేనే రకరకాల అనుభవాల సముద్రం. ఇక్కడ ప్రతిరోజూ మనకు ఏదో ఒక కొత్త విషయం ఎదురవుతూ ఉంటుంది. అయితే మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఎదిగాం అనే దానికంటే.. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనేదే చాలా ముఖ్యం.
కానీ మనశ్శాంతిగా ఉండాలంటే మనం కొన్ని విషయాలను పట్టించుకోవడం మానేయాలి(Letting Go) అంటున్నారు మానసిక నిపుణులు. అంటే ఏవి వదిలేయడం నేర్చుకోవాలో తెలుసుకోవాలని చెబుతున్నారు.
ఉదాహరణకు, ఎవరికైనా ఒక విషయం గురించి ఒకటి రెండు సార్లు చెప్పినా వారు అర్థం చేసుకోకపోతే, మళ్లీ మళ్లీ వారికి వివరించడానికి ప్రయత్నిస్తూ మన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవడం వదిలేయాలి.
అవతలి వ్యక్తి ఆలోచనా తీరును మనం మార్చలేనప్పుడు, మన ప్రయత్నాన్ని ఆపేసి మౌనంగా ఉండటమే మంచిది. అలాగే మన పిల్లలు పెద్దవారై తమ కాళ్ల మీద తాము నిలబడినప్పుడు, వారి ప్రతీ నిర్ణయంలో జోక్యం చేసుకోవడం వదిలేయాలి. వారికి తప్పొప్పులు తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలి.
చాలామంది తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మీ వెనుక ఎవరైనా తప్పుగా మాట్లాడినా లేదా మిమ్మల్ని పట్టించుకోకపోయినా, వారు మాట్లాడిన మాటలను మనసుకు తీసుకోవడం వదిలేయాలి. మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలిసినప్పుడు, ఇతరుల సర్టిఫికేట్లతో మీకు పని లేదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.
మన ఆలోచనలు అందరితో కలవాలని లేదు, ఒకవేళ ఎవరితోనైనా మనకు పొంతన కుదరకపోతే అటువంటి బంధాలను బలవంతంగా లాగడం కంటే..అక్కడే వదిలేయడమే మంచిది.
అలాగే మన చేతుల్లో లేని భవిష్యత్తు గురించి, రేపు ఏం జరుగుతుందో అన్న భయం గురించి ఆలోచించడం వదిలేయాలి. ఈ క్షణాన్ని అనుభవిస్తూ బతకడం అలవర్చుకోవాలి.
మన సామర్థ్యం కంటే ఎక్కువ ఆశలు పెట్టుకుని, మళ్లీ అవి తీరలేదని మనల్ని మనమే నిందించుకోవడం వదిలేయాలి. అలాగే ప్రతి మనిషి రంగు, ఎత్తు, తెలివితేటలు వేరువేరుగా ఉంటాయి, కాబట్టి ఇంకొకరితో మనల్ని మనం పోల్చుకోవడం వదిలేయాలి.
ముఖ్యంగా గడచిన కాలంలో జరిగిన పొరపాట్లను, పోగొట్టుకున్న అవకాశాలను తలుచుకుంటూ బాధపడటం వదిలేయాలి. అప్పుడు అలా చేయాల్సింది.. అప్పుడు అది చేయకుండా ఉండాల్సింది అని అనుకోవడం వదిలేయాలి.
జీవితంలో ఏది వచ్చినా, ఏది పోయినా ప్రశాంతతను మాత్రం కోల్పోకూడదు. ఈ “వదిలేయడం(Letting Go)” అనే సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తే, మీ వయస్సుతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు.
