Secret relationships
డేటింగ్ ప్లాట్‌ఫామ్ ఆష్లే మాడిసన్ అంతర్జాతీయ సర్వే ప్రకారం..ఆఫీసుల్లో మీటింగులు కంటే రిలేషన్ షిప్(secret relationships)లు ఎక్కువ అవుతున్నాయన్న వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆఫీస్‌లు కేవలం కెరీర్ పరంగా ఎదుగుదలకు కాకుండా, వివాహేతర సంబంధాల(relationships) హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని సర్వే వివరించింది. ఈ అంశంలో 11 దేశాల అధ్యయనంలో, మన భారతదేశం రెండో స్థానాన్ని ఆక్రమించగా.. మొదటి స్థానంలో అగ్రరాజ్యం మెక్సికో ఉందని చెప్పింది.దీంతో ఇండియాలో పెరుగుతున్న ఈ కల్చర్ దేనికి దారి తీస్తుందన్న చర్చ జోరుగా నడుస్తోంది.
డేటింగ్ ప్లాట్‌ఫామ్ ఆష్లే మాడిసన్ డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి పదిమంది ఉద్యోగుల్లో నలుగురు (40%) తమ ఆఫీసులోని కొలీగ్‌తో రహస్యంగా రొమాన్స్(Secret relationships) జరుపుతున్నారని తేలింది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో ఈ సంఖ్య 30% వద్ద ఉండగా, భారత్‌లో ఈ వర్క్ ప్లేస్ సీక్రెట్ ప్రేమాయణాలు విపరీతంగా పెరిగాయి.
ముఖ్యంగా, ఇంట్లో భార్య/భర్త ఉన్నా కూడా, ఈ సంబంధాలకు మగ ఉద్యోగులే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు సర్వే తేల్చింది. ఇంట్లో ఉన్న భాగస్వామితో భావోద్వేగ దూరం పెరగడం, ఎక్కువ పని గంటలు గడపడం వంటివి ఈ సీక్రెట్ రిలేషన్‌షషిప్పుల(Secret relationships)కు దారి తీస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్న భారతీయ నగరాల్లో కాంచీపురం మొదటి స్థానంలో నిలవగా, ఢిల్లీ తర్వాత స్థానంలో , హైదరాబాద్ 18వ స్థానంలో ఉంది.
ఆఫీసుల్లో, లేదా పని చేసే ప్రదేశాల్లో ఈ రిలేషన్‌లు పెరగడానికి నిపుణులు కొన్ని ముఖ్య కారణాలు గుర్తించారు.ఉద్యోగులు ఎక్కువ సమయం ఆఫీసులో లేదా పనికి సంబంధించిన వర్చువల్ మీటింగ్‌లలో గడపడం వల్ల, కొలీగ్స్‌తో బలమైన మానసిక బంధం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఒంటరితనం పెరిగిన తర్వాత, తమ భావాలు పంచుకోవడానికి సహోద్యోగులపై ఆధారపడటం ఎక్కువైంది.
రిమోట్ వర్క్ ద్వారా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసినా కూడా వీడియో కాల్స్, ఛాట్‌లు , అనధికారిక వర్చువల్ మీటింగ్‌లు తరచుగా జరగడం వల్ల, సహోద్యోగుల వ్యక్తిగత జీవితాల గురించి మరింత తెలుసుకునే అవకాశం పెరిగింది. ఇది వృత్తిపరమైన సరిహద్దులు (Professional Boundaries) కొద్దిగా చెరిగిపోవడానికి దారితీస్తోంది.
ఒకే కంపెనీలో పని చేసేవారికి, వృత్తిపరమైన లక్ష్యాలు, ఒత్తిళ్లు , సవాళ్లు ఒకే విధంగా ఉంటాయి. ఈ సాధారణ అనుభూతులు వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. ఈ ఆఫీస్ సంబంధాలు మీటింగ్‌లలో కాకుండా, అనధికారిక సమావేశాలలో (Casual Gatherings), లంచ్ బ్రేక్‌లలో లేదా వర్చువల్ అనధికారిక సంభాషణల సమయంలో ఏర్పడుతున్నాయని తేలింది.
అలాగే గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ (HR) సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం..చాలా కంపెనీల్లో 30% నుంచి 50% మంది ఉద్యోగులు తమ కెరీర్‌లో కనీసం ఒక్కసారైనా తమ సహోద్యోగితో రిలేషన్‌షిప్‌ను కలిగి ఉన్నట్లు అంగీకరించారు. యువత (Gen Z , Millennials) ఈ విషయంలో మరింత ధైర్యంగా ఉంటున్నారు. దాదాపు 60% మంది యువ ఉద్యోగులు తమ సహోద్యోగులతో డేటింగ్ చేయడం లేదా రిలేషన్‌షిప్‌లు పెట్టుకోవడం మామూలే అని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది..
ఆఫీసు సంబంధాలు పెరగడం వల్ల కంపెనీపైన,ఉద్యోగులపైనా భిన్నమైన ప్రభావాలు ఉంటాయి.రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తున్న ఇద్దరూ ఒకే చోట పనిచేయడం వల్ల పని పట్ల ఉత్సాహం పెరిగి, ఉత్పాదకత (Productivity) మెరుగుపడుతుంది. భాగస్వాముల మధ్య సహకారం , అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు తమ భాగస్వామి ఉన్న కంపెనీలో ఎక్కువ కాలం కొనసాగడానికి మొగ్గు చూపిస్తారు.
అలాగే వీటివల్ల కంపెనీకి, వారి వారి ఇంట్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలున్నాయి. కార్యాలయ సంబంధాల వల్ల కలిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే, అది పక్షపాతం (Favoritism) అనే భావనను పెంచుతుంది. ఒక మేనేజర్ తనతో రిలేషన్షిప్‌లో ఉన్న కొలీగ్‌కు ఎక్కువ శాలరీ హైక్, ఈజీ ప్రాజెక్టులు, ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇతరులలో అన్యాయం జరిగిందనే భావనను కలిగిస్తుంది.
అలాగే పక్షపాతం కారణంగా, ఆ జట్టులోని ఇతర ఉద్యోగుల నైతిక స్థైర్యం (Morale) దెబ్బతింటుంది. వారు తమ కృషికి సరైన గుర్తింపు లేదని భావిస్తారు, ఇది వారి ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది.
అంతేకాదు పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి తమ కంపెనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్‌ను తమతో రిలేషన్‌షిప్‌లో ఉన్నవారితో పంచుకుంటే అది వేరే పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా వారు ఎప్పటికీ అలాగే కలిసి ఉంటారన్న గ్యారంటీ ఉండదు. ఈ రిలేషన్‌ఫిప్ బ్రేక్ అయినపుడు అది నేరుగా ఆఫీస్ వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. ఆ ఇద్దరు భాగస్వాములు అదే ఆఫీసులో పనిచేయడం కష్టమవుతుంది. ఇది ఆ డిపార్టుమెంట్ మొత్తంలో టాక్సిక్ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
అలాగే విడిపోయిన తర్వాత, ఒక భాగస్వామి మరొకరిపై ప్రతీకార చర్యలకు పాల్పడొచ్చు లేదా వారి పనితీరును అడ్డుకోవడానికి ప్రయత్నించొచ్చు. అంతేకాదు ఈ రిలేషన్(relationships)లో ఉన్నప్పుడు,అలాగే గొడవలలో ఉన్నప్పుడు తమ పర్సనల్ విషయాలు ఆలోచిస్తూ పనిలో కాన్‌సన్‌ట్రేషన్ చేయరు. దీంతో కంపెనీ ప్రొడక్టవిటీ తగ్గిపోతుంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఇలాంటి రిలేషన్స్ లైంగిక వేధింపుల (Sexual Harassment) ఫిర్యాదులకు దారితీయొచ్చు. ముఖ్యంగా ఉన్నతాధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల మధ్య సంబంధాలు ఏర్పడినప్పుడు, ఒకవేళ అది విచ్ఛిన్నమైతే, అధికారాన్ని ఉపయోగించి తనను వేధించారని కిందిస్థాయి ఉద్యోగి ఆరోపించే అవకాశం కూడా ఉంది.
వేధింపుల ఆరోపణలు మీడియా దృష్టిని ఆకర్షిస్తే, సంస్థ యొక్క సామాజిక ప్రతిష్ట (Reputation), బ్రాండ్ విలువ తీవ్రంగా దెబ్బతింటాయి. దీనివల్ల ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం కష్టమవుతుంది.
సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు విడిపోయి, ఒకే టీమ్‌లో లేదా ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటే, వారిని వేరు చేయాల్సిన బాధ్యత కంపెనీపై ఉంటుంది. ఇది సంస్థాగత నిర్ణయాల కోసం కాకుండా, వ్యక్తిగత అవసరాల కోసం మార్పులు చేయడాన్ని సూచిస్తుంది.
కార్యాలయాల్లో ఏర్పడే రహస్య సంబంధాలు కేవలం ఇద్దరు వ్యక్తుల వృత్తి జీవితాన్ని మాత్రమే కాదు, ఇంటి గోడల మధ్య దాగి ఉన్న వారి కుటుంబ వ్యవస్థలనే అత్యంత భయంకరంగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ సంబంధాలు వెలుగులోకి వచ్చినప్పుడు, అది ఒకరి జీవితంలోనే కాక, వారి పిల్లలు, భాగస్వాములు,వృద్ధ తల్లిదండ్రుల జీవితంలో కూడా శాశ్వత గాయాలను మిగిల్చే విపత్తుగా మారుతుంది.
చాలా సందర్భాలలో, ఈ సీక్రెట్(Secret relationships) బయటపడిన తర్వాత క్షమించడానికి అవకాశం ఉండదు. ఆ బాధిత భాగస్వామికి వారిపై ఉన్న నమ్మకం మొత్తం పోతుంది. ఇకపై ఒక్క నిమిషం కూడా నీతో ఉండననే నిర్ణయం తక్షణమే తీసుకుని, ఆ వ్యక్తిని ఇంటి నుంచి గెంటేయడం లేదా వారు ఇంటిని వదిలి వెళ్లడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు కుటుంబ సభ్యులందరిలో తీవ్రమైన ఆందోళన, నిరాశ, భద్రతా లేమిని సృష్టిస్తాయి.
