Kumbhalgarh Fort : కుంభల్ గఢ్ కోటకు ఒక్కసారయినా వెళ్లాల్సిందే..

Kumbhalgarh Fort : ఆరావళి పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరంపై ఉన్న కుంభల్ గఢ్ కోటను 15వ శతాబ్దంలో రాణా కుంభ నిర్మించారు.

Kumbhalgarh Fort

రాజస్థాన్ అనగానే మనకు కోటలు,రాజభవనాలు,ఎడారి గుర్తుకు వస్తాయి. కానీ అక్కడ ఉన్న కుంభల్ గఢ్ కోట మాత్రం అన్నిటికంటే భిన్నమైనది. అలాగే అత్యంత శక్తివంతమైనది. ఆరావళి పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరంపై ఉన్న ఈ కుంభల్ గఢ్ (Kumbhalgarh Fort) కోటను 15వ శతాబ్దంలో రాణా కుంభ నిర్మించారు. ఈ కోట యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే దీని చుట్టూ ఉన్న భారీ గోడ. ఈ గోడ పొడవు సుమారు 36 కిలోమీటర్లు ఉంటుంది.

చైనాలోని గ్రేట్ వాల్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వాల్‌గా దీనికి గుర్తింపు ఉంది. అందుకే దీనిని ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఈ గోడ ఎంత వెడల్పుగా ఉంటుందంటే.. దీనిపై 8 గుర్రాలు పక్కపక్కనే పరుగెత్తగలవు. శత్రువులు ఎవరూ కూడా ఈ కోటను నేరుగా జయించలేకపోయారంటే.. దీని రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

చారిత్రక ప్రాముఖ్యత విషయానికి వస్తే, రాజపుత్ర వీరుడైన మహారాణా ప్రతాప్ పుట్టిన ప్లేస్ ఇదే. మేవార్ రాజవంశానికి ఆపద కలిగినప్పుడల్లా ఈ కోట వారికి సురక్షితమైన ఆశ్రయాన్ని ఇచ్చింది. చిత్తోర్‌గఢ్ కోటపై శత్రువులు దాడి చేసినప్పుడు కూడా రాణా వంశీయులు ఇక్కడికే వచ్చి తలదాచుకునేవారు.

కోట లోపల సుమారు 360 దేవాలయాలున్నాయి, అందులో 300 జైన దేవాలయాలు కాగా, మిగిలినవి హిందూ దేవాలయాలు. కోట అడుగు భాగం నుంచి పైకి వెళ్లే కొద్దీ మనకు అద్భుతమైన నిర్మాణ శైలి కనిపిస్తుంది. పైన ఉన్న బాదల్ మహల్ నుంచి చూస్తే ఆరావళి కొండల అందాలు, సమీపంలోని థార్ ఎడారి ఇసుక తిన్నెలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. కోట గోడల నిర్మాణంలో వాడిన రాళ్లు , వాటిని పేర్చిన విధానం నేటి ఇంజనీర్లకు కూడా ఒక సవాల్ వంటిది.

Kumbhalgarh Fort

పర్యాటకులు ఈ కోటను సందర్శించడానికి చలికాలం (అక్టోబర్ నుంచి మార్చి) అత్యంత అనువైన సమయం. ఉదయ్‌పూర్ నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఇక్కడికి చేరుకోవడం చాలా ఈజీ. ప్రతి రోజూ సాయంత్రం వేళ కోట ప్రాంగణంలో జరిగే లైట్ అండ్ సౌండ్ షో మిస్ కాకూడదు.

ఈ షో ద్వారా కోట హిస్టరీని , మహారాణా ప్రతాప్ వీరత్వాన్ని అద్భుతంగా వివరిస్తారు. రాత్రి సమయంలో కోట మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న దృశ్యం చూడటానికి రెండు కళ్లు సరిపోవంటారు. ప్రకృతి ప్రేమికులకు ఇక్కడ ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంది. చరిత్ర, సాహసం , ప్రకృతి సౌందర్యం కలగలిసిన కుంభల్ గఢ్ కోటను సందర్శించడం ప్రతి భారతీయుడికి ఒక గొప్ప అనుభవం. మన దేశ వారసత్వ సంపద ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఈ కోటను ఒక్కసారైనా సందర్శించి తీరాలి.

Japanese:జపాన్‌ ప్రజల లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సీక్రెట్ ఇదేనట.. మీరూ ట్రై చేయండి..

 

Exit mobile version