literature : లబ్ డబ్

literature : నేనేదో యంత్రమయినట్టు మీ ఒత్తిడిలన్నీ నాపైనే..నాకేదో తంత్రమొచ్చినట్టు మీ ఆశలన్నీ నాపైనే...

Literature

నేనూ.. మీ గుండెను
విరామమెరుగని  డెందెమును..
నాకే తెలీదు
ఎన్నాళ్లు సాగిపోతానో 
ఎప్పుడు ఆగిపోతానో …
నా శబ్దం చైతన్యం 
నా నిశ్శబ్దం శూన్యం..

మీ దేహంలో నా లయ ఉన్నంతవరకే
మీ మోహాలన్నీ…
మీ బొందిలో నేను సవ్వడి చేసినంతవరకే
మీ బంధాలన్నీ..
మీ అంతర్భాగమైన నన్ను
మీ అంతరంగంగా మార్చేసారు..

ఉద్వేగంలో జ్వలనమై రగులుతాను
ఉల్లాసంలో  జలధియై పొంగుతాను
కన్నీటిధారలో  వణుకుతాను 
నవ్వుల హోరులో పరిమళిస్తాను
ప్రేమ తాకిడిలో పులకరిస్తాను
విరహ వేడిలో కలవరమవుతాను

మీ కలల బాటలో నడిపించేది నేనే
మీ కష్టాల కడలిని దాటవేసేది నేనే
రాత్రి నిద్రలో భయాన్ని కాచేది నేనే
ఉషస్సంధ్యలో ఆశలు మేల్కొల్పేది నేనే
మీ భావాలకు తగిన రాగాలను పలికేది నేనే 
మీ బంధాలను నాలో బంధించేది నేనే…

ఎద లోపల ప్రీతియైన జ్ఞాపకాలో 
ఎడతెగని ప్రతీకార జ్వాలలో
ఎన్నిటినో స్మరిస్తుంటా 
ఎన్నిటినో భరిస్తుంటా
నేనేదో యంత్రమయినట్టు
మీ ఒత్తిడిలన్నీ నాపైనే..
నాకేదో తంత్రమొచ్చినట్టు
మీ ఆశలన్నీ నాపైనే…

కొందరు తరుక్కుపోతుంది అంటే 
కొందరు మండిపోతున్నాను అంటారు 
కొందరు చెరువైపోతుంది అంటే
కొందరు బరువైపోయింది అంటారు..
జాలి గుండె, రాతి గుండె అంటూ
ఉపమానాలు నాకు తగిలించి 
మీ ఊపిరికి ఉసురు పోసుకుంటారు…

మిత్రమా …
నీవేసే ప్రతి అడుగు నా ఆరోగ్యం
కలకాలం నా అలికిడి నీ భాగ్యం…
నా శాంతం కోసం నువు చేసే ధ్యానం
కడవరకు సాగించెను మన పయనం…

— ఫణి మండల

Literature: ఎన్నాళ్లయిందో..!

Exit mobile version