Literature : స్వతంత్రమింకా రాలేదు

Literature :బ్రతికే స్వతంత్రం ఇచ్చిందెవడు ? స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు? నాకింకా స్వాతంత్య్రం రాలేదు....

Literature

నాకింకా స్వాతంత్య్రం రాలేదు…
నింగిని, నేలను నమ్ముకొంటూ
మట్టిలో మొలకలు మొలిపించుటకు
పసిడి పంటలు పండించుటకు
మూడు పొద్దులూ దుక్కిటెద్దులా
కాయం నిండని బట్టలతో
కాలం ఎరుగక పరిశ్రమిస్తే
పండిన పంటకు ధర ఎంత?
వడలిన ఒడలు విలువెంత?
ఖరీదు కట్టే దళారీ వాడు
గిట్టే ధరలు పెట్టేదెవడు..?
కర్షక వీరుల కష్ట ఫలానికి
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

నాకింకా స్వాతంత్య్రం రాలేదు…
అమ్మా నాన్నల ఆశల తోటి
పిచ్చి ప్రపంచపు పోటి లోని
మూడో ఏడు గడవక ముందే
మూటను వీపున భారం పెట్టి
కొత్త ప్రపంచపు కార్ఖానాల్లోకి
ఏడుపు మోముతో మేమెళుతుంటే
ఆనందించే అమాయకత్వపు
అమ్మా నాన్నల మెదళ్ల దోచే
ఆరో తరగతి ఐఐటీలు….
విద్యయ్యిందీ వ్యాపారం
పిల్లాడి నెత్తిన పెనుభారం..
అందరిని ఒక తాటికి కట్టి
పోటీ అంటూ రేసులో పెట్టి
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

పట్టా పుచ్చుకు బయటకు వస్తే
ఉద్యోగమన్నా ఊసే లేదు
ఉపాధి దొరికే పత్తా లేదు…
నిరుద్యోగం నిప్పులు చెరిగితే
అమ్మా నాన్నల అప్పులు పెరిగితే
చిన్నో పెద్దో నౌకరి కోసం
పట్టణాలలో చాకిరి చేస్తూ
బతుకులు మారే రోజుల కోసం
ఎదురుచూపులు తప్పటలేదు…
కూడు పెట్టని చదువులుంటే
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

.
సుస్తీ చేస్తే చికిత్స కోసం
ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీస్తే
అందే వైద్యం గాల్లో దీపం
పేద ప్రాణం ఎంతో పాపం..
దవాఖానాలో వసతులు దైన్యం
కష్టం వస్తే అంతా శూన్యం..
కాసులు కొద్దీ కార్పొరేట్ సేవ
ప్రాణానికి లేదిక్కడ విలువ..
అందే వైద్యం అందలమెక్కితే
బ్రతికే స్వతంత్రం ఇచ్చిందెవడు ?
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు….

దండిగా నీకు ధనమే ఉంటే
నేరం కూడా ఘోరం కాదు …
పేదోడివైతే వెంటనే శిక్ష
పెద్దోడివైతే వాయిదాలే రక్ష..
పూచీకత్తుకి సొమ్ములు ఉంటే
బెయిల్లు ఇచ్చే మనుషులు ఉంటే
హత్య కేసయినా దేశం దాటు
ఏళ్లకు ఏళ్లు తీర్పులు లేటు..
లంచం కేసుకు వెంటనే ఖైదు
ఆర్థికనేరం రుజువే లేదు..
చట్టం న్యాయం సమానమన్నది
కాగితాలికే పరిమితమైతే
స్వతంత్రమొచ్చిందని చెప్పిందెవడు?
నాకింకా స్వాతంత్య్రం రాలేదు…

స్వతంత్రం అంటే జెండా ఎగరడం కాదు,
మనసు ఎగరడం, జీవితం వెలగడం…
వెలిగే దీపం చీకటి తరుమును
వాస్తవ స్వేచ్ఛ మనసులో వెలుగును..
అప్పుడే నిజమైన స్వాతంత్య్రం..
అప్పుడే నిజమైన స్వాతంత్య్రం

___ ఫణి మండల

Also Read: Literature

Exit mobile version