Mahua Sen
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న హిమాలయ బుక్ వరల్డ్‌లో ఇటీవల జరిగిన ..ది డెడ్ ఫిష్(రూపా పబ్లికేషన్స్) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ పుస్తకం ప్రఖ్యాత హిందీ రచయిత రాజ్‌కమల్ చౌదరి రచించిన “మచ్లీ మరి హుయ్” రచనకు ఆంగ్ల అనువాదం.
ఈ అనువాదాన్ని రచయిత్రి, అనువాదకురాలు మాహువా సేన్ (Mahua Sen) తెలుగులోకి బేస్ రూపంగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి పాఠకులు, సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విమర్శకులు ఈ అనువాదం భారతీయ ఆంగ్ల సాహిత్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని ప్రశంసించారు.
ది డెడ్ ఫిష్(The Dead Fish) రచన సాధారణమైనది కాదు. ఇందులో ప్రధాన పాత్ర అయిన నర్మల్ పద్మావత్ జీవితంలోని మానసిక, లైంగిక సంఘర్షణలు, భావోద్వేగాలను చాలా వాస్తవికంగా చూపించారు. రచయిత రాజ్‌కమల్ చౌదరి(Rajkamal Chaudhary) అసాధారణమైన రచనా శైలి, ఆలోచనా ధోరణి ఈ పుస్తకాన్ని ఒక క్లాసిక్‌గా నిలబెట్టాయి. భారతీయ సమాజం, వ్యక్తి స్వాతంత్ర్యం, మహిళలపై వివక్ష, లైంగికత వంటి సున్నితమైన అంశాలను ఈ పుస్తకంలో బోల్డ్‌గా చర్చించారు.
ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన మాహువా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె ఒక ప్రముఖ రచయిత్రి, కవి, అనువాదకురాలు. ఆమెకు గతంలో ‘రూయెల్ ఇంటర్నేషనల్ పోయెట్రీ ప్రైజ్’, ‘పోసిస్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లిటరేచర్‘ వంటి అనేక గౌరవాలు లభించాయి.
ఆమె రాసిన “నాస్టాల్జియా క్రాఫ్టింగ్ ఎ హోమ్ వితిన్” అనే పుస్తకం అమెజాన్ ఏషియన్ లిటరేచర్ విభాగంలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలు పొందిన మాహువా సేన్ ఒక మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్‌గా ఉన్న మాహువా సేన్, హైదరాబాద్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే రచనను ఒక జీవన మార్గంగా, దిక్సూచిగా భావిస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.
మొత్తంగా..ది డెడ్ ఫిష్ పుస్తకం ఆవిష్కరణ ఆధునిక భారతీయ సాహిత్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు అయింది. ఈ అనువాదం అసలు రచనలోని సహజత్వం, ప్రత్యేకతను చెక్కుచెదరకుండా మరో తరానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.