PAN card :పాన్ కార్డు వినియోగదారులకు అలర్ట్ ..డిసెంబర్ 31 లోపు ఈ పని చేసుకోండి..

PAN card : బ్యాంకు ఖాతా తెరవాలన్నా లేదా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి.

PAN card

భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు(PAN card) ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. బ్యాంకు ఖాతా తెరవాలన్నా లేదా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఇప్పుడు పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన గడువు తేదీ దగ్గరకు వచ్చేసింది. డిసెంబర్ 31 2025 తేదీ లోపు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు(PAN card) జనవరి 1 2026 నుంచి నిరుపయోగంగా మారుతుంది. అంటే మీ కార్డు స్తంభించిపోతుంది. ప్రభుత్వం ఇప్పటికే దీని గురించి అనేకసార్లు హెచ్చరించినా ఇంకా చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు.

ఒకవేళ మీరు గడువు లోపు లింక్ చేయకపోతే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా మీ పాన్ కార్డు (PAN card)ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది. దీనివల్ల మీరు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు. అలాగే మీకు రావాల్సిన టాక్స్ రీఫండ్‌లు కూడా ఆగిపోతాయి.

బ్యాంకుల్లో చేసే పెద్ద మొత్తంలో లావాదేవీలు , మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పాన్ కార్డు పని చేయకపోతే టీడీఎస్ మరియు టీసీఎస్ వంటివి ఎక్కువ మొత్తంలో కట్ అయ్యే అవకాశం ఉంటుంది. పాన్ కార్డు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు అది మీ ఆర్థిక అస్తిత్వానికి చిహ్నం కాబట్టి దీనిని యాక్టివ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

భారత ప్రభుత్వం పన్ను ఎగవేతను అరికట్టడానికి , ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు లేకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా ప్రతి వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండేలా పారదర్శకత వస్తుంది. ఇప్పటికే ఈ గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది కానీ డిసెంబర్ 31 2025 అనేది చివరి తేదీగా ప్రకటించారు. ఎవరైతే అక్టోబర్ 1 2024 లోపు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడి ద్వారా పాన్ కార్డు పొందారో వారు కచ్చితంగా తమ ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ పాన్ డేటాబేస్ వెరిఫై చేయబడి డూప్లికేషన్ లేకుండా ఉంటుంది.

మీరు మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేయొచ్చు. ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన ఇన్ కమ్ టాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ కు వెళ్లాలి.

PAN card

వెబ్‌సైట్: www.incometax.gov.in

ఎలా చెక్ చేయాలో స్టెప్స్ ఇవే:

  1. ముందుగా పైన చెప్పిన వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి.
  2. హోమ్ పేజీలోనే ఎడమ వైపున ‘Quick Links’ అనే సెక్షన్ ఉంటుంది.
  3. అందులో ‘Link Aadhaar Status’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి.
  4. ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నీ PAN Number ,Aadhaar Number ఎంటర్ చేయాలి.
  5. కింద ఉన్న ‘View Link Aadhaar Status’ అనే బటన్ మీద క్లిక్ చేయాలి.
  6. ఒకవేళ లింక్ అయి ఉంటే, “Your PAN is already linked to given Aadhaar” అని మెసేజ్ వస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే వెంటనే లింక్ చేసుకోమని చూపిస్తుంది

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. గడువు దాటిన తర్వాత లింక్ చేయాలనుకుంటే 1000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మందికి ఈ పెనాల్టీ వర్తిస్తోంది. కాబట్టి అనవసరమైన ఖర్చులను , ఇబ్బందులను నివారించుకోవడానికి ఇప్పుడే మీ లింక్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. మీ వివరాల్లో అంటే పేరు లేదా పుట్టిన తేదీలో ఏవైనా తేడాలు ఉంటే వాటిని ముందుగా సరిచేయించుకుని ఆ తర్వాత లింక్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో మీ ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగదు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version