Sanchar Saathi:సంచార్ సాథీపై కేంద్రం క్లారిటీ.. యాప్ తప్పనిసరి కాదు,ప్రజల గోప్యతకే పెద్ద పీట!

Sanchar Saathi: దేశంలో తయారు చేసే, విక్రయించే లేదా దిగుమతి చేసుకున్న ప్రతి స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్‌లోనూ ఈ యాప్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని అన్ని మొబైల్ కంపెనీలను ఆదేశించింది.

Sanchar Saathi

భారతదేశంలో అమ్ముడయ్యే ప్రతి కొత్త మొబైల్‌ఫోన్‌లో సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్‌ను డిఫాల్ట్‌గా (ముందస్తుగా) ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మొబైల్ తయారీదారులను ఆదేశించిన ఒక్క రోజు వ్యవధిలోనే, ఈ అంశం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఉత్తర్వులు వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయని, ఇది ప్రజల కదలికలను ట్రాక్ చేసే నియంతృత్వ ధోరణి అని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగి, ఈ విషయం దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయింది.

ఈ విమర్శలతో, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. కేంద్ర కమ్యూనికేషన్ల, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పార్లమెంటు వెలుపల మీడియా సమావేశంలో ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్దేశంపై నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi)యాప్ వినియోగదారులకు తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి సింధియా మాట్లాడుతూ, “ఈ యాప్‌(Sanchar Saathi)ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయమని మాత్రమే తయారీదారులను ఆదేశించడం జరిగింది. ఈ యాప్‌ను తమ డివైజ్/మొబైల్స్‌లో ఉంచుకోవాలా లేదా దాన్ని తీసివేయాలా (Un-install) అనేది పూర్తిగా వినియోగదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఈ యాప్‌ను డిలీట్ చేసుకునే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం ఈ సంచార్ సాథీ (Sanchar Saathi)యాప్ యొక్క ప్రయోజనాలు, దాని ఉద్దేశం దేశంలోని ప్రతి పౌరుడికి చేరాలనేదే తప్ప, బలవంతంగా వారిపై రుద్దడం కాదని” వివరించారు.

Sanchar Saathi

అసలు ఆదేశం, దాని లక్ష్యం ఏమిటి? సోమవారం ప్రభుత్వం జారీ చేసిన తొలి నోటిఫికేషన్ ప్రకారం, దేశంలో తయారు చేసే, విక్రయించే లేదా దిగుమతి చేసుకున్న ప్రతి స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్‌లోనూ ఈ యాప్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని అన్ని మొబైల్ కంపెనీలను ఆదేశించింది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది:

నకిలీ మొబైల్ ఫోన్‌లకు చెక్.. దొంగిలించబడిన లేదా నకిలీ ఐడెంటిఫికేషన్ (IMEI) నంబర్లు గల మొబైల్ ఫోన్‌ల అమ్మకాలను అరికట్టడం.

టెలికాం సేవల దుర్వినియోగం అరికట్టడం.. కేవైసీ (KYC) లేకుండా అక్రమంగా తీసుకున్న సిమ్ కార్డులు, అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించే టెలికాం సేవలను కనుగొని, వాటిని బ్లాక్ చేయడం.

తప్పిపోయిన ఫోన్ల గుర్తింపు.. ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, దాన్ని ట్రాక్ చేసి బ్లాక్ చేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది.

యాప్(Sanchar Saathi) లక్ష్యం మంచిదైనా కూడా..డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలనే నిర్ణయం గోప్యతా సమస్యలకు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తం కావడంతో, కేంద్రం తక్షణమే స్పందించి, వినియోగదారుడికి తీసివేసే స్వేచ్ఛను ఇస్తూ తాజా వివరణ ఇవ్వడం, రెండు రోజుల ఈ వైరల్ చర్చకు ముగింపు పలికినట్లు అయింది..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version