డస్సాల్ట్ ఏవియేషన్ ఏం చెప్పింది?
Rafale Fighter :భారత వైమానిక దళానికి చెందిన ఒక రఫేల్ యుద్ధ విమానం( Rafale Fighter 🙂 కూలిపోయిందని, అయితే అది శత్రు దాడిలో కాదని డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. ఈ ఘటన అధిక ఎత్తులో సాంకేతిక లోపం కారణంగా జరిగిందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. శత్రువుల రాడార్ల వల్ల లేదా దాడి వల్ల ఈ నష్టం జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. శిక్షణ సమయంలో 12,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని వివరించారు.
Rafale Fighter
సీడీఎస్ కీలక వ్యాఖ్యలు, పాకిస్థాన్ ప్రచారంపై ఖండన
భారత్, పాకిస్థాన్(India-Pakistan)ల మధ్య జరిగిన గత సైనిక ఘర్షణల్లో భారత్ రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయిందని భారత ప్రభుత్వం కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కానీ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, గత నెలలో సింగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఘర్షణల్లో IAF కొన్ని నష్టాలను చవిచూసిందని అంగీకరించినప్పటికీ, ఎన్ని విమానాలకు నష్టం వాటిల్లిందో మాత్రం వెల్లడించలేదు. అయితే, భారత్‌కు చెందిన రఫేల్‌తో సహా ఆరు విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన “పూర్తిగా అవాస్తవం” అని ఖండించారు. భారత దళాలు అనేక సందర్భాల్లో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించాయని ఆయన స్పష్టం చేశారు.
రఫేల్‌పై చైనా కుట్రపూరిత ప్రచారం
ఫ్రాన్స్ తయారీ ప్రతిష్ఠాత్మక రఫేల్ యుద్ధ విమానాల విషయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఫ్రాన్స్ సైనిక, నిఘా విభాగాలు గుర్తించాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల అనంతరం రఫేల్ పనితీరుపై అనుమానాలు వ్యాప్తి చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని తేలింది. రఫేల్ ఖ్యాతిని, దాని విక్రయాలను దెబ్బతీసేందుకు చైనా తన రాయబార కార్యాలయాలను ఉపయోగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా దౌత్య కార్యాలయాల్లోని రక్షణ శాఖ అధికారులు రఫేల్‌లు యుద్ధ క్షేత్రంలో పేలవంగా పనిచేశాయని చెబుతూ వాటి అమ్మకాలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఫ్రెంచ్ నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్డర్ చేసిన దేశాలను మరిన్ని రఫేల్‌లు కొనుగోలు చేయవద్దని, ఇతర దేశాలను చైనా తయారీ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.
పహల్గాం దాడికి ప్రతీకారం, పాక్ ప్రగల్భాలకు చెక్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వందలాది మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాలు సైనిక చర్యలు ప్రారంభించాయి. పాకిస్థాన్ క్షిపణులను భారత్ విజయవంతంగా కూల్చివేసింది. భారత్ క్షిపణుల వర్షం కురిపించి పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం కలిగించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, భారత్‌పై యుద్ధంలో తామే గెలిచామని, రఫేల్‌తో సహా పలు విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలికింది. డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్ ఎరిక్ ట్రాపియర్ చేసిన తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ చేసిన ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవని మరోసారి రుజువైంది.