Acid Rain
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య చెలరేగిన యుద్ధం ఇప్పుడు ఎవరూ ఊహించని విపత్తులను మోసుకొస్తోంది. తాజాగా టెహ్రాన్ పరిసరాల్లోని సుమారు 30కి పైగా చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలను టార్గెట్ చేసుకుని మార్చి 9, 2026న ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు జరపడంతో.. దీనివల్ల వెలువడిన నల్లటి మసి, విష వాయువులు ఆకాశాన్ని ఒక్కసారిగా కమ్మేశాయి. ఆ తర్వాత కురిసిన వర్షం సాధారణ వాన చుక్కలుగా కాకుండా ఆమ్ల వర్షం (Acid Rain/Black Rain) గా మారి అక్కడి ప్రజలను వణికించింది.
అయితే ఇక్కడ ఆమ్ల వర్షం (Acid Rain)అంటే ఏమిటి? ఎందుకు పడిందనే విషయానికి వస్తే..చమురు నిల్వలు తగలబడటం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ (SO2), నైట్రోజన్ ఆక్సైడ్స్ (NOx) వంటి పాయిజన్ కెమికల్స్ భారీ స్థాయిలో వాతావరణంలోకి రిలీజయిపోయాయి.
ఇవి మేఘాల్లోని తేమతో కలిసి కెమికల్ రియాక్షన్ జరిపి సల్ఫ్యూరిక్, నైట్రిక్ ఆమ్లాలుగా మారాయి. దీనివల్ల పడిన వర్షంతో అక్కడి కార్లపై, రోడ్లపై జిడ్డుగా, నల్లటి మరకలుగా పేరుకుపోయింది. టెహ్రాన్‌లో గాలి నాణ్యత (AQI) ఏకంగా 500 దాటిపోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 1991 గల్ఫ్ యుద్ధంలో కువైట్ చమురు బావుల మంటల వల్ల కలిగిన నష్టం కంటే కూడా ఇది ప్రమాదకరంగా మారుతోంది.
ఈ టాక్సిక్ రెయిన్ వల్ల ఇప్పటికే ఇరాన్‌లోని వేల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇరాన్ రెడ్ క్రెసెంట్ హెచ్చరికల ప్రకారం చాలామందిలో చర్మంతో పాటు కళ్లు ఎఫెక్ట్ అయ్యాయి.ఈ వర్షపు నీళ్లు చర్మంపై పడితే తీవ్రమైన దహనం (Chemical Burns), ఎర్రబడుతున్నాయి. కళ్లలోకి వెళ్తే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది.
విష వాయువులను పీల్చటం వల్ల చాలామందిలో ఆస్తమా, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
మరోవైపు ఈ ఆమ్ల వర్షం (Acid Rain)వల్ల రసాయనాలన్నీ మట్టిలో, నీటిలో చేరడం వల్ల ఆహార గొలుసు మొత్తం విషపూరితం అవుతోంది. ఇది భవిష్యత్తులో క్యాన్సర్, గుండె జబ్బులు , నాడీ వ్యవస్థ దెబ్బతినడానికి కారణంగా మారుతుంది.
ఈ యుద్ధం వల్ల కేవలం ఇరాన్ ఒక్కటే కాదు, అంతర్జాతీయంగా చమురు ధరలు బారెల్‌కు 150 డాలర్లకు చేరడం వల్ల భారత్ వంటి ఎన్నో దేశాలపై నెలకు వేల కోట్ల రూపాయల భారం పెరుగుతుంది. ప్రకృతిని ధ్వంసం చేసే ఏ యుద్ధం కూడా ఎవరికీ విజయాన్ని ఇవ్వదన్న విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా గుర్తించలేకపోతోంది.
ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని శాంతి చర్చలు జరపకపోతే, మానవాళి మరిన్ని పర్యావరణ విపత్తులను చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
