Aadhaar card
దేశంలోని సామాన్య ప్రజలకు, ముఖ్యంగా వీధి వ్యాపారులకు , చిన్నపాటి చిరువ్యాపారాలు చేసుకునే వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ‘పీఎం స్వనిధి’ (PM SVANidhi) పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే ఈ విషయం చాలామందికి పెద్దగా తెలియదు. ఈ పథకం కింద ఎటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే.. కేవలం ఆధార్ కార్డు(Aadhaar card) ఆధారంగా రూ. 90,000 వరకు రుణ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంది.
చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లేదా కొత్తగా ఏదైనా చిన్న పని ప్రారంభించడానికి ఇది నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఈ స్కీమ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ రుణాన్ని మూడు విడతలలో మంజూరు చేయడం ఈ పథకం యొక్క ప్రత్యేకత.
తొలి విడతలో భాగంగా అర్హులైన చిరువ్యాపారులకు రూ. 10,000 రుణాన్ని అందిస్తారు. దీనిని సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రెండో విడతలో రూ. 20,000 రుణం ఇస్తారు. ఇక రెండో విడత రుణాన్ని కూడా గడువులోగా చెల్లిస్తే, అంటే మంచి క్రెడిట్ హిస్టరీని కొనసాగిస్తే మూడో విడతలో ఏకంగా రూ. 50,000 నుంచి మీ సిబిల్ స్కోర్ ఆధారంగా రూ. 90,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
ఈ పథకంలో మరో పెద్ద ప్రయోజనం ఏంటంటే, రుణం తీసుకున్న వారు వాయిదాలను సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం 7 శాతం వడ్డీ రాయితీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలోనే జమ చేస్తుంది. దీనికి తోడు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో డిజిటల్ చెల్లింపులు చేసే వ్యాపారులకు ప్రత్యేకంగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రభుత్వం అందిస్తోంది.
ఈ రుణం పొందడానికి ఎటువంటి షూరిటీ లేదా గ్యారంటీ ఇవ్వాల్సిన పని లేదు. కేవలం ఆధార్ కార్డు(Aadhaar card), బ్యాంకు అకౌంట్ వివరాలు ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆన్‌లైన్‌లో పీఎం స్వనిధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా సమీపంలోని మీ-సేవ కేంద్రాలు, సీఎస్‌సీ సెంటర్లు లేదా డైరక్టుగా బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు ఫారమ్ ఇవ్వొచ్చు.
దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన జరిపి, లోన్‌ను మంజూరు చేస్తారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అకౌంట్లలోకి డబ్బులు రావడం వల్ల ఇది చిరు వ్యాపారులకు కొండంత అండగా మారుతోంది. చిన్నపాటి బిజినెస్ చేయాలనే ఆశయం ఉండి పెట్టుబడి లేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
