IndiGo Airlines
డిసెంబర్ 3 నుంచి 5 తేదీల మధ్య దేశంలోని వివిధ విమానాశ్రయాలలో ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) ప్రయాణీకులు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులపై ఆ సంస్థ క్షమాపణ చెప్పడమే కాక, భారీ పరిహారాన్ని ప్రకటించింది. విపరీతమైన రద్దీ , విమానాల ఆలస్యం/రద్దు కారణంగా గంటల తరబడి విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన కస్టమర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణీకులకు రూ.10,000 (పది వేల రూపాయలు) విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తామని ఇండిగో స్పష్టం చేసింది. ఈ వోచర్‌లు జారీ చేసిన తేదీ నుంచి 12 నెలల కాలానికి చెల్లుబాటు అవుతాయి. అంటే, ఈ వోచర్‌లను ఉపయోగించి రాబోయే సంవత్సరంలో ఇండిగో విమానాల్లో ప్రయాణించొచ్చు.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రూ. 10,000 పరిహారం కేవలం వోచర్ రూపంలో అందించే అదనపు నష్టపరిహారం మాత్రమే. దీనితో పాటు, టికెట్ రద్దు అయిన ప్రయాణీకులకు చెల్లించాల్సిన పూర్తి విమాన టిక్కెట్ రిఫండ్‌ను కూడా ఇండిగో అందిస్తుంది. అంటే, రిఫండ్ , వోచర్ రూపంలో డబుల్ బెనిఫిట్ లభిస్తుంది.
ఇప్పటికే చాలా వరకు రిఫండ్‌లను క్లియర్ చేసినట్లు ఇండిగో తెలిపింది. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సిన పరిహారానికి కూడా ఇండిగో కట్టుబడి ఉంది. ఆ నిబంధనల ప్రకారం, విమానం బయలుదేరడానికి 24 గంటలలోపు రద్దు అయిన విమానాల కస్టమర్‌లకు విమానం ప్రయాణించిన సమయాన్ని (బ్లాక్ టైమ్) బట్టి రూ.000 నుంచి రూ.1,000 వరకు పరిహారం అందించబడుతుంది.
తమ కస్టమర్‌లు ఆశించే సురక్షితమైన, సున్నితమైన,నమ్మదగిన సేవలను తిరిగి అందించడానికి కట్టుబడి ఉన్నామని, మళ్లీ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇండిగో ప్రతినిధి పేర్కొన్నారు.
