Supreme Court
కొన్ని సంఘటనలు హాస్యాస్పదంగా అనిపించినా, వాటి వెనుక ఉన్న వాస్తవాలు ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నిస్తాయి. బీహార్‌లో చోటు చేసుకున్న అలాంటిదే ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం (EC) రికార్డుల్లో చనిపోయిన వ్యక్తి, సజీవంగా సుప్రీంకోర్టు (Supreme Court)ముందు ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన ఈసీ పనితీరుపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది.
ఆగస్టు 12న సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. బీహార్‌లోని భోజ్‌పురి జిల్లా ఆరా నియోజకవర్గానికి చెందిన 41 ఏళ్ల మింటు పాశ్వాన్, తాను చనిపోయినట్లు ఈసీ ధృవీకరించడంతో తాను బతికే ఉన్నానంటూ సుప్రీంకోర్టు(Supreme Court) ముందు నిలబడ్డారు.
బీహార్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో, చనిపోయారని భావించిన ఇద్దరు వ్యక్తులను యోగేంద్ర యాదవ్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈసీ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టుకు వివరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 1న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోని 65 లక్షల మందిలో పాశ్వాన్ కూడా ఒకరు.ఆరాలో డ్రైవర్‌గా పనిచేసే మింటు పాశ్వాన్(Mintu Paswan ), తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు.
నా పేరు ఓటర్ల జాబితాలో లేదని, నేను చనిపోయినట్లు అధికారులు ప్రకటించారని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాను. నేను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి వీడియోలు కూడా చేశాను. ఇప్పుడు ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే, బ్యాంకు ఖాతా పత్రాలు, స్కూల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు అడుగుతున్నారు. నా పేరు తొలగించేటప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు మాత్రం ఇవన్నీ అడుగుతున్నారని పాశ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాశ్వాన్‌కు తోడుగా నిలిచిన సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యే శివ ప్రకాష్ రంజన్, ఈసీ హడావుడిగా చేస్తున్న ఈ ప్రక్రియ వల్ల చాలామంది పేదలు, వలస కార్మికులు ఓటు హక్కు కోల్పోతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి ఒకరి పేరు తొలగించే ముందు, ఆ వ్యక్తి బతికి ఉన్నాడో లేదో తెలుసుకోవాలి కదా? ఇరుగుపొరుగు వారితో విచారించాలి. ఎవరో ఎక్కడో కూర్చుని ఒక వ్యక్తి చనిపోయాడని చెబితే ఎలా? అని ప్రశ్నించారు.
ఈసీ పౌరసత్వాన్ని నిరూపించుకునే భారాన్ని ప్రజలపై మోపుతోందని పిటిషనర్లు వాదించారు. ఎమ్మెల్యే రంజన్ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక పొరపాటు కాదని, ఈ ప్రక్రియ రూపొందించిన తీరులోనే లోపం ఉందని చెప్పారు. భోజ్‌పురి జిల్లాలో తమ బృందాలు ఇంటింటికీ తిరిగి పరిశీలించగా, ఆరా నియోజకవర్గంలోనే ఇలాంటి నాలుగు సందర్భాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.
ఈసీ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది, కోర్టు(Supreme Court)లో వ్యక్తులను హాజరుపరచడం ఒక డ్రామా అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అయితే, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం ఇది కేవలం అనుకోకుండా జరిగిన పొరపాటు అయ్యి ఉంటుందని వ్యాఖ్యానించింది.
కానీ, ఈ విధంగా సామూహికంగా ఓటు హక్కు రద్దుచేసే పరిస్థితి ఉంటే తాము జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన హామీని యోగేంద్ర యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా ఈసీ హడావుడిగా చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఇలాంటి ఘటనలు తెలియజేస్తున్నాయి.